రష్యాలోని ఇర్కుట్స్క్ ప్రాంతంలో ఓ మహిళా ల్యాబ్ ఉద్యోగి మృతి తీవ్ర కలకలం రేపింది. ఆమెకు ‘న్యూమోనిక్ ప్లేగు’ సోకిందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారితీశాయి.
ఇర్కుట్స్క్ ప్రాంతంలోని ప్లేగు పరిశోధనా కేంద్రంలో పనిచేస్తున్న 28 ఏళ్ల ల్యాబ్ అసిస్టెంట్ దారియా షిపిలోవా అక్టోబర్ 2న తీవ్రమైన న్యూమోనియా లక్షణాలతో బాధపడుతూ మృతి చెందినట్లు సమాచారం.
ల్యాబ్లో ప్రయోగాలు నిర్వహిస్తున్న సమయంలో ఓ టెస్ట్ ట్యూబ్ పగిలిపోవడంతో, ఆమెకు అత్యంత ప్రమాదకరమైన ‘న్యూమోనిక్ ప్లేగు’ సోకినట్లు కొన్ని మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీంతో ఈ వార్త అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసింది.
ఈ వ్యవహారం అంతర్జాతీయ స్థాయిలో కలకలం రేపడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) రష్యా ఆరోగ్య శాఖను అత్యవసర వివరణ కోరింది.
WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రేయేసస్ వెల్లడించిన అధికారిక సమాచారంలో రష్యా ప్రభుత్వం ఇచ్చిన వివరణలను ధృవీకరించినట్లు తెలిపారు.
రష్యా ఆరోగ్య సంస్థ రోస్పోట్రెబ్నాడ్జోర్ నిర్వహించిన సమగ్ర దర్యాప్తులో, మృతి చెందిన మహిళ శరీరం నుంచి సేకరించిన నమూనాల్లో ప్లేగు లేదా ఇతర ప్రమాదకరమైన వ్యాధికారక క్రిములు గుర్తించబడలేదని వెల్లడైంది.
అంతేకాకుండా, ఇర్కుట్స్క్ ప్రాంతంలో ఇటీవల ఎలాంటి ప్లేగు కేసులు నమోదు కాలేదని అధికారులు తెలిపారు.
ల్యాబ్లో ప్రమాదకరమైన క్రిములు లీక్ కావడం లేదా ఇతర బయోసేఫ్టీ ప్రమాదం జరిగినట్లు కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదని పేర్కొన్నారు.
మృతి చెందిన మహిళతో సన్నిహితంగా ఉన్న వ్యక్తులందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచి పరీక్షలు నిర్వహించినట్లు, వారిలో ఎవరికీ ప్లేగు లక్షణాలు కనిపించలేదని సమాచారం.
అయితే, ఆ మహిళ మృతికి అసలు కారణమైన వ్యాధికారక క్రిమి ఏది?, న్యూమోనియాతో బాధపడుతున్నట్లు చెబుతున్న మరో ఉద్యోగి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? అనే విషయాలపై మరింత సమాచారం ఇవ్వాలని WHO రష్యాను కోరింది.
ప్రజారోగ్యానికి సంబంధించిన ప్రమాదాలను సకాలంలో గుర్తించడంతో పాటు, అనవసరమైన భయాందోళనలు మరియు వదంతులను నివారించేందుకు పారదర్శకమైన, ఖచ్చితమైన సమాచారాన్ని అందించడం చాలా ముఖ్యమని WHO స్పష్టం చేసింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రష్యాలో మళ్లీ ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందుతోందని నిర్ధారించే ఆధారాలు లేవు.

Leave a Reply