కార్పొరేట్ సంస్థల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న 12 గంటల పని, ఓవర్‌టైమ్ సంస్కృతికి క్రమంగా ముగింపు పలికే దిశగా నేటి యువత ఆలోచనా విధానం మారుతోంది. ముఖ్యంగా జెన్ Z తరం ‘క్వైట్ యాంబిషన్’ (Quiet Ambition) అనే కొత్త విధానాన్ని అనుసరిస్తోందన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.
కెరీర్లో మంచి స్థాయికి చేరుకోవాలి, పదోన్నతులు పొందాలి, మెరుగైన జీతం సంపాదించాలి అనే ఆశ యువతలో లేకపోలేదు. అయితే.. అందుకోసం ప్రతిరోజూ 12 గంటలు ఆఫీసులో గడుపుతూ తమ ఆరోగ్యాన్ని, మానసిక ప్రశాంతతను త్యాగం చేయడానికి మాత్రం వారు సిద్ధంగా లేరు.
గతంలో ఉద్యోగంలో ఎదగడానికి, పైఅధికారుల ప్రశంసలు పొందడానికి చాలామంది ఉద్యోగులు అర్ధరాత్రి వరకు ఆఫీసులోనే ఉండి పనిచేయడాన్ని గొప్పగా భావించేవారు.
కానీ ప్రస్తుత తరం మాత్రం “ఉద్యోగం అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే.. అదే మొత్తం జీవితం కాదు” అనే భావనకు ప్రాధాన్యత ఇస్తోంది.
ఆఫీసుకు కేటాయించిన 8 గంటల్లో తమ సామర్థ్యాన్ని, శ్రమను పూర్తిగా వినియోగించి.. ఆ తర్వాత వ్యక్తిగత జీవితం, కుటుంబం, ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు సమయం కేటాయించాలనేది యువత అభిప్రాయంగా కనిపిస్తోంది.
ఇటీవలి చర్చలు, అధ్యయనాల ప్రకారం ఈ విధానాన్ని సోమరితనంగా చూడకూడదని, పని సామర్థ్యంతో పాటు మానసిక ఆరోగ్యానికి సమతుల్యత కల్పించే ఆధునిక విధానంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు.
తమ అర్హతకు తగిన పదోన్నతి, జీతాన్ని ఆశిస్తూనే.. తమ వ్యక్తిగత జీవితాన్ని దెబ్బతీసే అధిక పని, దోపిడీ తరహా వర్క్ కల్చర్‌ను తిరస్కరిస్తున్న యువత వైఖరి ఇప్పుడు కార్పొరేట్ సంస్థల మేనేజ్మెంట్ కూడా తమ పని విధానాలను పునరాలోచించేలా చేస్తోంది.
కెరీర్లో ఎదగాలి.. కానీ అందుకోసం జీవితాన్నే కోల్పోవద్దు — ఇదే నేటి యువతలో పెరుగుతున్న కొత్త ఆలోచనగా మారుతోంది.

Leave a Reply