పూర్వీకులను స్మరించుకునే ఆచారం భారతదేశంలోనే కాకుండా, ప్రపంచంలోని వివిధ దేశాల్లో రకరకాల రూపాల్లో కొనసాగుతోంది.
చనిపోయిన తమ కుటుంబ సభ్యులను గుర్తుచేసుకుంటూ, వారి ఆత్మశాంతి కోసం ప్రార్థించడం ప్రపంచంలోని పలు సమాజాలలో ఒక సంప్రదాయంగా వస్తోంది.
హిందూ సాంప్రదాయంలో ‘పితృపక్షం’ అనేది పితృదేవతల స్మరణ కోసం అంకితమైన పవిత్ర సమయం. భాద్రపద/ఆశ్వయుజ మాసంలోని కృష్ణపక్ష కాలాన్ని పితృపక్షంగా పాటిస్తారు. ఈ రోజుల్లో పూర్వీకుల ఆత్మల కోసం శ్రాద్ధ కర్మలు, తర్పణాలు వంటి పూజాదికాలు నిర్వహిస్తారు.
క్రైస్తవులు ‘ఆల్ సోల్స్ డే’ (All Souls’ Day – సర్వ ఆత్మల దినోత్సవం) ద్వారా పరలోకానికి చేరిన తమ పూర్వీకులను స్మరించుకుంటారు. ముస్లింలలో ‘షబ్-ఎ-బరాత్’ (Shab-e-Barat) వంటి పర్వదినాల్లో చనిపోయిన పూర్వీకుల పాపాల మన్నింపు, శాంతి కోసం ప్రార్థించే ఆచారం ఉంది. యూదులలో కూడా ‘యిజ్కోర్’ (Yizkor) వంటి స్మారక ప్రార్థనల ద్వారా గతించిన తమ బంధువులను గుర్తుచేసుకుంటారు.
మెక్సికోలో జరుపుకునే ‘డే ఆఫ్ ద డెడ్’ (Día de los Muertos) సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో పూర్వీకులను స్మరించుకునేందుకు ప్రత్యేకమైన సంప్రదాయాలు ఉన్నాయి. ఆచరించే పద్ధతులు వేరైనా.. తమకు జన్మనిచ్చి, పెంచి పెద్దచేసిన పూర్వీకులను కృతజ్ఞతతో స్మరించుకోవడం అనేది ప్రపంచ మానవాళిని ఏకం చేసే ఒక ఉమ్మడి భావోద్వేగం.
