ఢిల్లీకి చెందిన ఒక యువకుడు, అతని ప్రియురాలు గత 8 నెలలుగా ఒకే ఇంట్లో భార్యాభర్తల్లా లివ్-ఇన్ రిలేషన్షిప్లో కలిసి జీవిస్తున్నారు.
సదరు యువకుడు గతంలో హర్యానా రాష్ట్రంలోని హసన్గఢ్ గ్రామంలో ఒక కిరాణా దుకాణం నడిపేవాడు. ఆ తర్వాత దుకాణాన్ని మూసివేసి ఢిల్లీకి మకాం మార్చాడు.
గత సెప్టెంబర్ 26న, వీరిద్దరూ కారులో తమ స్నేహితులను కలిసేందుకు రోహ్తక్ ప్రాంతానికి వెళ్లారు. సెప్టెంబర్ 30న ఆ యువకుడు తన తల్లితో ఫోన్లో మాట్లాడటమే చివరి సంభాషణగా మిగిలింది. ఆ తర్వాత ఇద్దరి ఆచూకీ గల్లంతైంది.
ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం అసౌధా సమీపంలోని కాలువలో ఇద్దరి మృతదేహాలు తేలియాడుతూ కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది.
పోలీసుల ప్రాథమిక విచారణలో ఆ యువకుడు ఇటీవల తన భూమిని అమ్మి సుమారు రూ.30 లక్షల నగదు తన వద్ద ఉంచుకున్నట్లు తేలింది. అంతేకాకుండా వారు ప్రయాణించిన కారు కూడా అదృశ్యమైంది. దీంతో డబ్బు, కారును కాజేసేందుకే స్నేహితులే ఈ ఘాతుకానికి ఒడిగట్టి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ జంట హత్యల కేసులో ఆ యువకుడి స్నేహితులైన నితేశ్, మరో నితేశ్ అనే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి, మూడు రోజుల కస్టడీకి తీసుకుని సమగ్ర విచారణ జరుపుతున్నారు.
