కూతురు పెళ్లి తర్వాత అత్తారింట్లో సంతోషంగా ఉండాలనే ఏ తల్లిదండ్రులైనా కోరుకుంటారు.
అయితే, భారీగా ఖర్చు చేసి, రూ.25 లక్షల వరకట్నం ఇచ్చినా కూడా ఒక వివాహిత అత్తారింట్లో అనుభవించిన నరకయాతన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తోంది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఆగ్రాకు చెందిన ఒక యువతికి గత ఏప్రిల్ 20న ఘనంగా వివాహం జరిగింది. వివాహ వేడుకల సమయంలోనే వరుడి తరఫు వారు రూ.25 లక్షల వరకట్నం డిమాండ్ చేయడంతో, వధువు తండ్రి గత్యంతరం లేక ఆ మొత్తాన్ని ముట్టజెప్పాడు.
కానీ, శోభనం రోజే భర్త పెట్టిన వికృతమైన, దారుణమైన షరతు విని ఆ నవవధువు నిర్ఘాంతపోయింది. ‘తన మాజీ ప్రేయసి తనను మోసం చేసిందని, అందుకు ప్రతీకారంగా తన స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని’ భర్త ఆమెపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు. ఆమె దీనిని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, భర్త వేధించడం ఆపలేదు.
ఇదిలా ఉండగా, భర్త సోదరి (ఆడపడుచు) ఆ వివాహిత మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌ను దొంగతనంగా తెలుసుకుని.. అందులోని వ్యక్తిగత వివరాలను, ఆమె పనిచేసే కంపెనీకి సంబంధించిన కీలక రహస్య సమాచారాన్ని కాజేసింది.
ఆ తర్వాత సదరు మహిళ తన ఉద్యోగ నిమిత్తం బెంగళూరు వెళ్లగా, భర్త కూడా అక్కడికి ఆమెను వెంబడిస్తూ వెళ్లాడు. అక్కడ భార్య ఫోన్, ల్యాప్‌టాప్‌లోని ఆఫీస్ డేటా, చాటింగ్ వివరాలను తన ఫోన్లోకి బదిలీ చేసుకుని, ఆమె ఫోన్లోని వాట్సాప్ చాట్లను డిలీట్ చేశాడు.
ప్రస్తుతం ఆ రహస్య డేటాను అడ్డం పెట్టుకుని, తనను సోషల్ మీడియాలో బద్నాం చేస్తానని భర్త బెదిరింపులకు దిగుతున్నాడని బాధితురాలు కన్నీటిపర్యంతమైంది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరుపుతున్నారు.
