“భారత్‌లో స్టార్‌లింక్ రాకుండా అడ్డుకుంటున్నది ఎవరో తెలుసా?” — ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు.. భగ్గుమంటున్న నెటిజన్లు..!!

ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్, భారత్‌లో తన బ్రాడ్‌బ్యాండ్ సేవలను ప్రారంభించేందుకు చాలాకాలంగా ప్రయత్నిస్తోంది.

అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పొందాల్సిన తుది అనుమతులు, లైసెన్సింగ్ ప్రక్రియలో ఇంకా జాప్యం కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో భారత్‌లోని అనేక గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేదంటూ ఓ ఎక్స్ (X) యూజర్ చేసిన పోస్ట్ ఎలాన్ మస్క్ దృష్టికి వెళ్లింది.

దీనికి స్పందించిన ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

“దురదృష్టవశాత్తూ.. భారత ప్రజలపై తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి కొంతమంది బడా ధనవంతులు మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వారు ఎవరో మీరే ఊహించుకోవచ్చు. ఈ విషయం భారత ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఇది వారికి జరుగుతున్న అన్యాయం” అంటూ పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశారు.

ప్రస్తుతం ఉన్న ఇంటర్నెట్ ధరలను భరించలేని వారితో పాటు, అసలు ఇంటర్నెట్ సదుపాయమే లేని గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా వేగవంతమైన, అందుబాటు ధరలో ఇంటర్నెట్ సేవలను అందించడమే స్టార్‌లింక్ లక్ష్యం అని మస్క్ స్పష్టం చేశారు.

ఇదిలా ఉండగా, భారత్‌లో ఇప్పటికే 20 గేట్‌వే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు స్టార్‌లింక్ తెలిపింది. భారత వినియోగదారుల డేటా దేశం వెలుపలకు వెళ్లకుండా, దేశంలోనే సురక్షితంగా నిల్వ ఉండేలా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు సంస్థ బిజినెస్ ఆపరేషన్స్ వైస్ ప్రెసిడెంట్ లారెన్ డ్రేయర్ వెల్లడించారు.

అలాగే జియో, ఎయిర్‌టెల్ వంటి భారతీయ సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు స్టార్‌లింక్ సిద్ధంగా ఉందని ఆమె తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి తుది అనుమతులు లభించిన వెంటనే భారత్‌లో సేవలను ప్రారంభించేందుకు తమ సంస్థ పూర్తిగా సిద్ధంగా ఉందని ఆమె స్పష్టం చేశారు.

అయితే భారత్‌లో స్టార్‌లింక్ సేవలకు నిజంగా ఎవరి వల్ల ఆలస్యం జరుగుతోంది? ఎలాన్ మస్క్ చేసిన ఈ వ్యాఖ్యల వెనుక ఎవరున్నారు? అనే అంశంపై ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.


Posted

in

by

Tags: