“హోటల్ బుకింగ్ చేసుకునే ముందే అటవీశాఖ అనుమతి తప్పనిసరి!”.. 4,000 మంది పర్యాటకులు పోటెత్తడంతో అడ్డుకుని వెనక్కి పంపిన వైనం..!!!

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన ధర్మశాలలో ఉన్న త్రియుండ్ (Triund) ట్రెక్కింగ్ మార్గంలో, వారాంతాల్లో అదుపుతప్పి పోటెత్తుతున్న పర్యాటకుల రద్దీని నియంత్రించేందుకు, కొండ ప్రాంత సహజ సిద్ధమైన పర్యావరణాన్ని కాపాడేందుకు అటవీశాఖ కఠిన ఆంక్షలను అమల్లోకి తెచ్చింది.

ఇకపై త్రియుండ్ ట్రెక్కింగ్‌కు రోజుకు గరిష్టంగా 1,000 మంది పర్యాటకులకు మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్లు అటవీశాఖ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల వరుస సెలవు దినాల్లో త్రియుండ్ కొండ మార్గంలో వేలాది మంది పర్యాటకులు గుమిగూడటంతో తీవ్ర రద్దీ ఏర్పడటమే కాకుండా పర్యావరణానికి ముప్పు వాటిల్లింది.

సోషల్ మీడియాలో వైరల్ అయిన దృశ్యాల్లో ఒకేసారి 3,000 నుంచి 4,000 మంది వరకు పర్యాటకులు చేరుకున్నారనే ఆందోళనకర సమాచారం వ్యాపించడంతో అటవీశాఖ అధికారులు రంగంలోకి దిగారు. త్రియుండ్ ప్రాంత సామర్థ్యం రోజుకు 1,000 మంది మాత్రమేనని నిర్ధారించి, అంతకుమించి ఎవరినీ అనుమతించకూడదని ఆదేశాలు జారీ చేశారు.

కొత్త నిబంధనల ప్రకారం, త్రియుండ్ వెళ్లాలనుకునే పర్యాటకులు, ట్రెక్కింగ్ గైడ్లు ధర్మశాల ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ద్వారా ముందస్తు అనుమతి (పర్మిట్) పొందాల్సి ఉంటుంది. అటవీశాఖ జారీ చేసే పర్మిట్ స్లిప్ లేకుండా కొండపైకి ఎక్కేందుకు ప్రయత్నించే వారికి భారీ జరిమానా విధిస్తారు.

అంతేకాకుండా, ధర్మశాలలోని హోటళ్లు, గెస్ట్ హౌస్‌లు, ట్రావెల్ ఏజెంట్లు త్రియుండ్ ట్రెక్కింగ్ బుకింగ్స్ తీసుకునేటప్పుడు అటవీశాఖ విధించిన ఈ 1,000 మంది పరిమితిని కచ్చితంగా పాటించాలని సూచించారు.

ప్రకృతి అందాలతో అలరారే ఈ కొండ ప్రాంతాన్ని ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి కాపాడేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నివారించేందుకు చెక్‌పోస్టుల వద్ద అదనపు అటవీశాఖ సిబ్బందిని గస్తీ (పెట్రోలింగ్) విధుల్లో మోహరించారు.


Posted

in

by

Tags: