“మనవళ్ల కోసం ఆస్తి ఇవ్వడానికి నిరాకరించిన తండ్రి..!” — అర్ధరాత్రి రాయితో కొట్టి చంపిన కన్న కొడుకు.. తెలంగాణలో దారుణం..!!

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి వివాదం కారణంగా 70 ఏళ్ల వృద్ధుడిని అతని కన్న కొడుకే రాయితో కొట్టి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

రంగారెడ్డి జిల్లా ఫరూక్‌నగర్ మండలంలోని దూస్కల్ గ్రామానికి చెందిన **బాగం పోచయ్య (70)**కు మల్లేశ్ అనే కుమారుడు ఉన్నాడు.

మద్యం వ్యసనానికి బానిసైన మల్లేశ్.. గతంలో కుటుంబానికి చెందిన కొంత భూమిని విక్రయించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మిగిలిన భూమిని కూడా తన పేరుపై రాసివ్వాలని తండ్రి పోచయ్యపై మల్లేశ్ ఒత్తిడి చేస్తూ వచ్చాడు.

అయితే మిగిలిన ఆస్తిని కూడా మల్లేశ్ పేరుపై రాసిస్తే.. అతని ఇద్దరు కుమారుల భవిష్యత్తు దెబ్బతింటుందని భావించిన పోచయ్య, ఆస్తిని ఇవ్వడానికి నిరాకరించాడు. దీంతో తండ్రీకొడుకుల మధ్య తరచూ ఆస్తి విషయంలో గొడవలు జరుగుతుండేవి.

బుధవారం రాత్రి కూడా ఆస్తి విషయమై ఇద్దరి మధ్య మరోసారి తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన మల్లేశ్.. అర్ధరాత్రి సమయంలో పెద్ద రాయిని తీసుకుని తండ్రి పోచయ్య తలపై బలంగా కొట్టాడు.

ఈ దాడిలో తలకు తీవ్ర గాయాలైన పోచయ్య.. రక్తపు మడుగులో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

గురువారం తెల్లవారుజామున ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: