మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ జిల్లాలో 17 ఏళ్ల బాలిక దారుణ హత్యకు గురైనట్లు భావిస్తున్న ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
సెప్టెంబర్ 30వ తేదీన పాఠశాలకు వెళ్తున్నానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలిక, ఆ తర్వాత తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. సుమారు 6 రోజుల తర్వాత మలావర్ (Malawar) పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో బాలిక మృతదేహం లభ్యమైంది.
పోలీసులు నిర్వహించిన ప్రాథమిక విచారణలో, బాలిక మృతదేహం తల మొండెం వేరు చేసిన స్థితిలో పడి ఉన్నట్లు తేలింది. ఘటనా స్థలం నుంచి రక్తపు మరకలున్న కత్తి, బాలిక స్కూల్ బ్యాగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నర్సింగ్‌గఢ్ ప్రాంతానికి చెందిన అనురాగ్ అలియాస్ అంకిత్ అనే యువకుడిపై బాలిక కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. పోలీసులు విచారణ జరపగా, బాలికకు ఆ యువకుడితో పరిచయం ఉన్నట్లు సమాచారం లభించింది.
ఆ యువకుడే బాలికను తనతో పాటు తీసుకెళ్లి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్న తరుణంలో, ఈ కేసులో మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. బాలికను తీసుకెళ్లాడని అనుమానిస్తున్న యువకుడు, మలావర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతని మృతికి, బాలిక హత్యకు ఏదైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా, మరో యువకుడిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
బாலిక కోసం గాలించే క్రమంలో పోలీసులు పలు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఒక కెమెరా ఫుటేజీలో ఓ యువకుడు ఒంటరిగా బైక్‌పై వెళ్తుండగా, మరో బైక్‌పై బాలికతో పాటు ఇంకో యువకుడు వెళ్తున్న దృశ్యాలు రికార్డయినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత లభించిన దృశ్యాల్లో ముగ్గురూ కలిసి వెళ్లడం, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఇద్దరు యువకులు మాత్రమే ఉండటం కనిపించిందని పోలీసులు తెలిపారు. దీంతో మొబైల్ ఫోన్ లొకేషన్ తదితర ఆధారాలతో అటవీ ప్రాంతంలో గాలించగా బాలిక మృతదేహం లభ్యమైంది. ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణుల సహాయంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేయగా, పోస్టుమార్టం, ఫోరెన్సిక్ నివేదికలు వచ్చిన తర్వాత హత్యకు గల కారణాలతో పాటు కీలక వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
