భారతదేశంలో ఉన్న ఈ ప్రాంతాన్ని చూస్తే అస్సలు నమ్మలేరు.! ఇజ్రాయెల్‌ లాగా మారిపోయిన గ్రామం. ఇక్కడ విదేశీయులు నెలల తరబడి ఎందుకు ఉంటున్నారో తెలుసా.?

హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల సమీపంలో, ధౌలాధర్ పర్వత శ్రేణుల ఒడిలో ఉన్న అందమైన గ్రామం ధర్మకోట్.

మెక్‌లియోడ్‌గంజ్ నుంచి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం, ఇజ్రాయెల్ పర్యాటకులు ఎక్కువగా వచ్చి బస చేసే ప్రాంతంగా మారడంతో దీనిని ‘మినీ ఇజ్రాయెల్ ఆఫ్ ఇండియా’ అని పిలుస్తారు. ఇక్కడ హిబ్రూ భాషలో రాసిన బోర్డులు, ఇజ్రాయెల్ ఆహార పదార్థాలు, ఆ దేశ సంస్కృతికి అద్దంపట్టే ప్రదేశాలను కూడా చూడవచ్చు.

1960లలో దలైలామా ధర్మశాలకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో విదేశీ పర్యాటకుల రాక పెరిగిందని స్థానిక సమాచారం. ప్రశాంతమైన వాతావరణం, ప్రకృతి అందాలు, ఏకాంతాన్ని కోరుకునే ఇజ్రాయెలీలు క్రమంగా ధర్మకోట్ వైపు రావడం ప్రారంభించారు. కాలక్రమేణా స్థానిక దుకాణదారులు, లాడ్జీలు, హోటళ్లు నిర్వహించేవారు హిబ్రూ భాషను అర్థం చేసుకోవడం కూడా ప్రారంభించారు.

ధర్మకోట్‌లో ఉన్న ‘చబాద్ హౌస్’ (Chabad House) ఇజ్రాయెల్ సమాజానికి ముఖ్యమైన మత, సామాజిక కేంద్రంగా ఉంది. అక్కడి అనేక రెస్టారెంట్లలో ఫలాఫెల్, పిటా బ్రెడ్, షక్షుకా తదితర ఇజ్రాయెల్ వంటకాలు లభిస్తాయి. యోగా, ధ్యానం, సంగీతం, కళలకు సంబంధించిన శిక్షణ కోసం కూడా విదేశీ పర్యాటకులు ఇక్కడ ఎక్కువ రోజులు బస చేస్తుంటారని చెబుతారు.

ప్రస్తుతం భద్రతా కారణాల దృష్ట్యా ధర్మకోట్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు సాధారణ నిఘాను పెంచారు. అదే సమయంలో, ఇజ్రాయెల్, మధ్యప్రాచ్య (మిడిల్ ఈస్ట్) ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రత్యక్ష విమాన సౌకర్యాలు లేకపోవడం తదితర కారణాల వల్ల ఈ ఏడాది ఇజ్రాయెల్ పర్యాటకుల రాక కాస్త తగ్గిందని స్థానిక వ్యాపారులు తెలిపారు.


Posted

in

by

Tags: