మధ్య చైనాలో 21 ఏళ్లుగా చెత్త ఏరుకుంటూ అత్యంత దీనస్థితిలో బతుకుతున్న 71 ఏళ్ల వృద్ధుడి జీవితంలో ఊహించని అద్భుతం జరిగింది. తన బ్యాంకు ఖాతాలో లక్షల్లో పెన్షన్ డబ్బు జమ అయినట్లు తెలుసుకున్న ఆ వృద్ధుడి ఆనందం అందరినీ కంటతడి పెట్టిస్తోంది.
హునాన్ ప్రావిన్స్‌లోని చాంగ్డే నగరంలో నివసిస్తున్న ‘రు’ (Ru) అనే వృద్ధుడు, 2000వ దశకం ప్రారంభంలో తన ప్రభుత్వ ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆ తర్వాత ఎదురైన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యల కారణంగా జీవనాధారం కోల్పోయి, ఏళ్లుగా చెత్త ఏరుకుంటూ అతికష్టం మీద కాలం వెళ్లదీస్తున్నాడు.
గతేడాది (2024) చలికాలంలో స్థానిక సామాజిక సంక్షేమ శాఖ అధికారుల చొరవతో ఆయనను ఒక పునరావాస కేంద్రానికి (Rescue camp) తరలించారు. అక్కడ ఆయన వ్యక్తిగత వివరాలను పరిశీలించగా.. అతను చాలా ఏళ్ల క్రితమే ప్రభుత్వ పెన్షన్ పొందడానికి అర్హుడని అధికారులకు తెలిసింది.
దీంతో అధికారులు ఆయనకు ఒక బ్యాంక్ కార్డును అందజేశారు. అందులో ఏకంగా 4 లక్షల 20 వేల యువాన్లకు పైగా (సుమారు 63,000 డాలర్లు / భారత కరెన్సీలో రూ.52 లక్షలకు పైగా) పొదుపు డబ్బు ఉన్నట్లు తెలుసుకున్న ఆ వృద్ధుడు ఆనందభాష్పాలు రాల్చాడు. ఆ డబ్బుతో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, ఇకపై తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతానని ఆయన ఎంతో సంతోషంగా తెలిపాడు.

Leave a Reply