ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడా వెస్ట్ ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తుల (హై-ఎండ్) అపార్ట్‌మెంట్లలో వరుసగా జరుగుతున్న ఆత్మహత్యలు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధతో ఓ వ్యక్తి 49వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే.. తాజాగా అదే ప్రాంతంలో మరో విషాదం చోటుచేసుకుంది.
స్థానిక పోలీస్ స్టేషన్ పరిధిలోని ‘ఏస్ డివినో’ (Ace Divino) అనే ప్రముఖ సొసైటీలో నివసిస్తున్న అనిల్ కుమార్ (36) అనే వ్యక్తి.. అకస్మాత్తుగా తాను ఉంటున్న 12వ అంతస్తు నుంచి కిందకు దూకి ప్రాణాలు విడిచాడు. అమాంతం పైనుంచి ఏదో పడిన భారీ శబ్దం రావడంతో భద్రతా సిబ్బంది, స్థానికులు వెంటనే అక్కడికి పరుగులు తీశారు. తీరా అక్కడ చూసేసరికి అతడు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి వణికిపోయారు.
మరణించిన అనిల్ కుమార్ గత కొద్ది రోజులుగా తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలతో బాధపడుతున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై మృతుడి కుటుంబ సభ్యులు, స్నేహితులను విచారిస్తున్నారు. మహానగరాల్లో ఇలా వరుసగా జరుగుతున్న ఆత్మహత్యల ఘటనలు ప్రజల్లో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తున్నాయి.

Leave a Reply