దేశ రాజధాని ఢిల్లీలోని ఒక ప్రముఖ నైట్‌క్లబ్‌లో జరిగిన ఓ చిన్న పొరపాటు దారుణమైన హత్యకు దారితీసిన తీరు ప్రజలందరినీ ఉలిక్కిపడేలా చేసింది.
క్లబ్ లోపల సరదాగా మందు తాగుతున్న సమయంలో అనుకోకుండా ఒక మహిళపై బీరు చిందడాన్ని సాకుగా తీసుకుని, అక్కడున్న బౌన్సర్లు, సిబ్బంది కలిసి 29 ఏళ్ల యువకుడిని కొట్టి చంపిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ కిరాతక దాడి పబ్ కల్చర్ ముసుగును తొలగించడమే కాకుండా, భద్రత పేరుతో జరుగుతున్న దౌర్జన్యాలను వెలుగులోకి తెచ్చింది.
ఢిల్లీలోని ఒక నైట్‌క్లబ్‌కు రఘువీర్ నగర్‌కు చెందిన డ్రైవర్ దల్జీత్ (29) తన స్నేహితులతో కలిసి వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుల్లో ఒకరి చేతిలోని బీరు పొరపాటున అక్కడున్న ఒక మహిళపై పడింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న నైట్‌క్లబ్ బౌన్సర్లు, వెయిటర్లు ఆ యువకులపై విచక్షణారహితంగా దాడి చేయడం ప్రారంభించారు.
దల్జీత్ అతని స్నేహితులు ఎంతగా క్షమాపణలు చెప్పినా వినకుండా, కర్రలతో దాడి చేయడంతో పాటు గాజు సీసాలతో విచక్షణారహితంగా పొడిచారు. అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయేందుకు ప్రయత్నించిన వారిని బలవంతంగా మళ్లీ లోపలికి లాక్కెళ్లి వారు చేసిన దాష్టీకం చూసిన వారి మనసులను కలచివేసింది.
ఈ దారుణ దాడిలో తీవ్రంగా గాయపడిన దల్జీత్‌ను అతని స్నేహితులు ఇంటికి తీసుకెళ్లగా, ఇంటి గుమ్మం వద్దే కుప్పకూలిపోయి ప్రాణాలు విడిచాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఎనిమిదేళ్ల కుమారుడిని, భార్యను ఒంటరి వాళ్ళను చేస్తూ జరిగిన ఈ విషాద ఘటన స్థానికులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ఈ ఘటనకు సంబంధించి కొందరు నిందితులను పోలీసులు అరెస్టు చేయగా, సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి మిగిలిన హంతకుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.

Leave a Reply