రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ వృద్ధురాలు దుకాణానికి వచ్చి లస్సీ అడగడం, తన వద్ద ఉన్న కేవలం 7 రూపాయలను చేతుల్లో ఉంచి ఇవ్వజూపిన ఘటన అక్కడున్న ప్రతి ఒక్కరి హృదయాలను హత్తుకుంది.
స్నేహితులతో కలిసి లస్సీ తాగుతున్న ఓ యువకుడు, అక్కడికి వచ్చిన సుమారు 80 ఏళ్ల వయసున్న నిస్సహాయ వృద్ధురాలిని గమనించాడు. ఆమెకు కేవలం డబ్బులు ఇచ్చి పంపించేయకుండా, తన పక్కనే కూర్చోబెట్టుకుని మర్యాదగా లస్సీ కొనిచ్చాడు.
అయితే ఆ బామ్మ ఎవరి వద్దా ఉచితంగా ఏదీ తీసుకోవడానికి ఇష్టపడలేదు. తన చేతిలో ఉన్న 6 లేదా 7 రూపాయల చిల్లర నాణేలను ఆ యువకుడి చేతిలో పెడుతూ.. “ఇది కూడా కలుపుకో నాయనా” అంటూ వణుకుతున్న చేతులతో ముందుకు చాచింది. ఆమె చూపిన ఆత్మాభిమానం ఆ యువకుడి మనసును ఎంతగానో కదిలించింది.
బామ్మలోని ఆత్మగౌరవాన్ని చూసి ఆశ్చర్యపోయిన ఆ యువకుడు ఆ డబ్బులు తీసుకోవడానికి సున్నితంగా నిరాకరించాడు. ఆమె నేలపై కూర్చోవడం చూసి, తను కూడా ఎలాంటి భేషజాలు లేకుండా నేలపైనే ఆమె పక్కన కూర్చుని ఎంతో ఆప్యాయంగా లస్సీ తాగాడు.
ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన దుకాణ యజమాని చలించిపోతూ.. “నా దుకాణానికి రోజూ ఎంతోమంది కస్టమర్లు వస్తుంటారు, కానీ నిజమైన మనుషులు అప్పుడప్పుడు మాత్రమే వస్తారు” అంటూ ఆ బామ్మను ఎంతో గౌరవంతో కుర్చీలో కూర్చోబెట్టాడు. ఈ హృదయపూర్వక సంఘటన నిజమైన మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది.

Leave a Reply