చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరికీ సుపరిచితమైన బార్బీ (Barbie) బొమ్మ, తాజాగా తన ప్యాకేజింగ్ బాక్స్ డిజైన్ కారణంగా తీవ్ర వివాదంలో చిక్కుకుంది.
ప్రముఖ బొమ్మల తయారీ సంస్థ ‘మ్యాటెల్’ (Mattel) మార్కెట్‌లోకి విడుదల చేసిన జిమ్నాస్టిక్ బార్బీ డాల్ బాక్స్ వెనుక భాగంలో ఉన్న ఓ డిజైన్.. అచ్చం హిట్లర్ నాజీ సెల్యూట్‌ను (Nazi Salute) పోలి ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మ్యాటెల్ సంస్థ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలంటూ (Boycott) నెట్టింట ప్రచారం మొదలైంది.
అమెరికాకు చెందిన టిక్‌టాక్ క్రియేటర్ అనా ఎలిజబెత్, ఓ స్టోర్‌లో షాపింగ్ చేస్తున్న సమయంలో ఈ బొమ్మను గమనించినట్లు సమాచారం. మ్యాటెల్ విడుదల చేసిన ‘యు కెన్ డూ ఎనీథింగ్’ (You Can Do Anything) సిరీస్‌లోని జిమ్నాస్టిక్స్ బార్బీ డాల్ బాక్స్ వెనుక భాగంలో చేతులు పైకెత్తిన ప్రేక్షకుల డ్రాయింగ్ (చిత్రం) ఉంది. అయితే అందులోని ప్రేక్షకుల చేయి ఎత్తిన భంగిమ నాజీ సెల్యూట్‌లా కనిపిస్తోందని ఆమె ఓ వీడియో ద్వారా వేలెత్తి చూపారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లో వైరల్‌గా మారింది.
ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు.. ఇంత పెద్ద సంస్థ క్వాలిటీ కంట్రోల్ విభాగం ఇలాంటి డిజైన్‌ను ఎలా గుర్తించకుండా వదిలేసిందని ప్రశ్నించారు. అంతేకాకుండా, మ్యాటెల్ ఉత్పత్తులను కొనుగోలు చేయొద్దంటూ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
అయితే, ఈ విమర్శలను అందరూ సమర్థించట్లేదు. బాక్స్‌పై ఉన్నది నాజీ సెల్యూట్ కాదని, క్రీడా పోటీల్లో తమ అభిమాన క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ ప్రేక్షకులు చేతులు పైకెత్తి మద్దతు తెలుపుతున్న దృశ్యమై ఉంటుందని మరికొందరు సర్దిచెబుతున్నారు. దీంతో ఆ డిజైన్‌ను కావాలనే రూపొందించారా లేక అనుకోకుండా అలా కనిపించిందా అనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

Leave a Reply