ప్రపంచ భవిష్యత్తు, యుద్ధాలు, వినాశనాల గురించి చర్చ వచ్చినప్పుడల్లా చాలామందికి ఠక్కున గుర్తొచ్చే పేరు బాబా వంగా. ‘బాల్కన్ ప్రాంత నాస్ట్రడామస్’గా గుర్తింపు పొందిన ఆమె పేరుతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక సంచలన జోస్యం తెగ చక్కర్లు కొడుతోంది.
ఈ ప్రచారం 2026 నాటికి ప్రపంచం పెను ముప్పును ఎదుర్కొనుందా అనే అనుమానాలను రేకెత్తిస్తోంది.
బ్రిటన్కు చెందిన ‘డైలీ స్టార్’ ప్రచురించినట్లుగా చెబుతున్న కథనం ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ దేశాల మధ్య తీవ్ర రాజకీయ, భద్రతా సంక్షోభం తలెత్తవచ్చని, 3వ ప్రపంచ యుద్ధం మొదలుకావచ్చని బాబా వంగా పేరుతో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ జోస్యానికి ఎలాంటి విశ్వసనీయమైన ఆధారాలు ఉన్నాయనేది మాత్రం స్పష్టంగా లేదు.
అలాగే ఈ వైరల్ పోస్టుల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురించిన అంశాలు కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఈ ఏడాది చివరి నాటికి రష్యా నాయకత్వంలో పెను మార్పులు జరిగి, పుతిన్ సుదీర్ఘ పాలనకు తెరపడవచ్చని అందులో పేర్కొన్నారు. ప్రస్తుతం రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, రష్యా-పాశ్చాత్య దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి ప్రచారాలు ప్రజల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.
అయితే, బాబా వంగా పేరుతో అంతర్జాలంలో ప్రచారమయ్యే చాలా జోస్యాలకు ఎలాంటి లిఖితపూర్వక లేదా అధికారిక ఆధారాలు ఉండవని నిపుణులు పలుమార్లు స్పష్టం చేశారు. కాబట్టి 2026 ముగిసేలోపు మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని గానీ, పుతిన్ పాలన అంతమవుతుందని గానీ చెప్పే వార్తలను నిజాలుగా నిర్ధారించలేము. కేవలం సంచలనం కోసం పెట్టే ఇలాంటి శీర్షికలను చూసి ఆందోళన చెందడం కంటే, ఆ వార్తల్లోని వాస్తవాలను, విశ్వసనీయతను పరిశీలించడమే ముఖ్యం.

Leave a Reply