బీహార్ రాష్ట్రంలోని గయా ప్రాంతంలో మానవ సంబంధాలను మంటగలిపే అత్యంత దారుణమైన హత్యోదంతం వెలుగులోకి వచ్చింది.
రక్త క్యాన్సర్‌తో తీవ్రంగా బాధపడుతున్న కృష్ణ గుప్తా అనే వృద్ధుడు హత్యకు గురై, ఆయన మృతదేహం నిర్మానుష్య ప్రాంతంలోని పొదల్లో పడి ఉండటాన్ని గుర్తించారు. ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని చెప్పి బయటకు తీసుకొచ్చిన కన్నతండ్రినే, సొంత కొడుకు కనికరం లేకుండా కొట్టి చంపినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
ఈ కిరాతక చర్యకు ప్రధాన కారణం.. నిందితుడికి తన ఇంటి పక్కనే నివసించే వివాహితతో కొన్నేళ్లుగా ఉన్న వివాహేతర సంబంధమేనని తేలింది. కుటుంబ ఆస్తులను ఆ మహిళ పేరిట రాయాలని తండ్రిపై కొడుకు తీవ్రంగా ఒత్తిడి తెచ్చినట్లు గుర్తించారు.
ప్రియురాలి మాయమాటలు నమ్మిన కొడుకు చందన్ రాజ్, తండ్రితో గొడవపడి, గత సెప్టెంబర్ 24న ఆసుపత్రికి తీసుకెళ్లే నెపంతో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడ కర్రలు, రాళ్లతో తండ్రిపై విచక్షణారహితంగా దాడి చేసి దారుణంగా హతమార్చి పరారయ్యాడు.
తండ్రీకొడుకులు కనిపించడం లేదని కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. మొబైల్ ఫోన్ సిగ్నల్స్, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుడు చందన్ రాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు తన తండ్రిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ మహిళతో పాటు, ఈ కుట్రతో సంబంధమున్న మిగతా వ్యక్తుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ప్రాణాంతక వ్యాధితో పోరాడుతున్న తండ్రిని కంటికి రెప్పలా కాపాడాల్సిన కొడుకే కాలయముడిగా మారిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆగ్రహాన్ని, దిగ్భ్రాంతిని కలిగించింది.

Leave a Reply