“క్యాన్సర్‌నే నయం చేస్తానన్న బాబాకేమైంది?”.. పాము రూపంలో వచ్చిన పరీక్ష.. ఆశ్చర్యంలో గ్రామస్తులు..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఛతర్‌పూర్ జిల్లాలోని కైదీ గ్రామంలో గల అజైపాల్ ధామ్ ఆలయంలో అద్భుతాలు చేస్తానంటూ ‘రహస్య చీటీలు’ రాసిచ్చే కరణ్ కుష్వాహా అనే ప్రసిద్ధ బాబా, ప్రమాదవశాత్తు ఒక పాముపై కాలు వేయడంతో భయపడి అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

బాగేశ్వర్ బాబా తరహాలోనే ఆధ్యాత్మిక దర్బార్‌లు నిర్వహించే ఇతను, అనుకోకుండా తన కాళ్ల కింద పాము చుట్టుకుని ఉండటాన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

వెంటనే అక్కడున్న భక్తులు, సహాయకులు అతడిని కాపాడి చికిత్స నిమిత్తం ఛతర్‌పూర్‌లోని క్రిస్టియన్ ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న అజైపాల్ ధామ్ భక్తులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకోవడంతో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ ఇన్‌స్పెక్టర్ సతీష్ సింగ్ నేతృత్వంలోని పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వైద్యులు నిర్వహించిన పరీక్షల్లో బాబా శరీరంలో పాము కాటు వేసిన ఆనవాళ్లు గానీ, విష ప్రభావం గానీ లేదని, కేవలం భయం, తీవ్ర దిగ్భ్రాంతి వల్లే అతను స్పృహతప్పాడని స్పష్టం చేశారు.

క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులను కూడా నయం చేయగలనని చెప్పుకునే ఈ బాబా, ఒక చిన్న పామును చూసి భయంతో స్పృహతప్పి పడిపోవడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆసుపత్రిలో పరిశీలన అనంతరం కోలుకుని డిశ్చార్జ్ అయిన కరణ్ కుష్వాహా, “తాను పూర్తిగా క్షేమంగా ఉన్నానని, భక్తులెవరూ ఆందోళన చెందవద్దని, యథావిధిగా ఆధ్యాత్మిక దర్బార్ కార్యక్రమాలు కొనసాగుతాయని” ప్రకటన విడుదల చేసి తన అనుచరులను శాంతింపజేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *