గుజరాత్ రాష్ట్రం రాజ్‌కోట్‌లోని కువాడ్వా రోడ్డులో ఉన్న షహీద్ ఉధమ్సింగ్జీ టౌన్షిప్లో, గత అక్టోబర్ 12వ తేదీన రెండు సంవత్సరాల నాలుగు నెలల వయసున్న చిన్నారి స్నేహ సకారియా ఐదో అంతస్తు నుంచి కిందపడి దారుణంగా మరణించింది.
మొదట ఇది ఒక ప్రమాదం అని అందరూ భావించినప్పటికీ, తాజాగా ఈ ఘటనలో దిగ్భ్రాంతికరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి.
ఈ ఘటనపై తీవ్ర దర్యాప్తు చేపట్టిన పోలీసు అధికారులు.. మొదట్లో తాను ఏ పాపం ఎరుగని అమాయకురాలినని కన్నీరుమున్నీరుగా విలపించిన చిన్నారి తల్లి పూనమ్ సకారియాను తమదైన శైలిలో గట్టిగా విచారించారు. ఆ విచారణలో, తన సొంత బిడ్డను తానే ఐదో అంతస్తు నుంచి కిందకు విసిరేసి దారుణంగా హత్య చేసినట్లు పూనమ్ షాకింగ్ నిజాన్ని అంగీకరించింది.
భర్తతో ఏర్పడిన మనస్పర్థల కారణంగా గత ఏడాదికి పైగా తన కూతురితో కలిసి వేరుగా ఉంటున్న పూనమ్‌కు.. ఆ పసిపాప పుట్టినప్పటి నుంచే ఇష్టం లేదని, పాప తనకు ఒక పెద్ద భారంగా అనిపించేదని ఆమె పోలీసుల విచారణలో తెలిపింది. అంతేకాకుండా, తనపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు తన భర్తపైనే అబద్ధపు ఆరోపణలు చేస్తూ నాటకమాడినట్లు కూడా విచారణలో బట్టబయలైంది.
చిన్నారి కింద పడిన చోట గోడ సుమారు నాలుగు అడుగుల ఎత్తు ఉండటం, మృతదేహం భవనానికి కొన్ని అడుగుల దూరంలో పడి ఉండటం పోలీసుల అనుమానాలకు బలాన్ని చేకూర్చాయి. తల్లే తన సొంత బిడ్డను చంపిన ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహాన్ని రేకెత్తించింది. పూనమ్‌పై హత్య కేసు నమోదు చేసిన పోలీసులు తదుపరి దర్యాప్తును ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.

Leave a Reply