ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మృతుల్లో భార్యాభర్తలతో పాటు వారి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
రాత్రి నూడుల్స్, టీ తాగిన అనంతరం కుటుంబ సభ్యులంతా నిద్రపోయినట్లు సమాచారం. అయితే, తెల్లవారేసరికి వారంతా విగతజీవులుగా కనిపించడం స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఇంట్లోనే ఐదుగురి మృతదేహాలు..
రబూపురా ప్రాంతానికి చెందిన మహేశ్ (36), ఆయన భార్య లలిత (34), కుమారుడు లట్టు (12), కుమార్తెలు మిష్టి (8), సాక్షి (4) మృతి చెందినట్లు కథనం పేర్కొంది.
శుక్రవారం ఉదయం చాలా సమయం గడిచినా ఇంటి తలుపులు తెరవకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చింది. దీంతో వారు ఇంట్లోకి వెళ్లి చూడగా, ఐదుగురూ మంచాలపై విగతజీవులుగా కనిపించారు. ఈ దృశ్యం చూసి వారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆహారంలో విషపదార్థాలే కారణమా?
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఐదుగురి మరణాలకు గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.
ప్రాథమిక విచారణలో ఆహార విషతుల్యత (ఫుడ్ పాయిజనింగ్) కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నట్లు సమాచారం. అయితే, నూడుల్స్ లేదా ఇతర ఆహారం వల్లే ఈ మరణాలు సంభవించాయని ఇప్పటివరకు నిర్ధారణ కాలేదు.
పోస్టుమార్టం నివేదిక కోసం ఎదురుచూపులు!
ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులను విచారిస్తూ ఆధారాలు సేకరిస్తున్నారు.
మృతదేహాలను పోస్టుమార్టం కోసం పంపించినట్లు సమాచారం. నివేదిక వచ్చిన తర్వాతే మరణాలకు అసలు కారణం స్పష్టమవుతుందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply