మధురైలో ఆన్లైన్ పేమెంట్ ద్వారా డబ్బులు చెల్లించేశామని నమ్మించి, ఓ బియ్యం దుకాణం నుంచి గుర్తుతెలియని వ్యక్తులు 17 బస్తాల బియ్యాన్ని మోసపూరితంగా ఎత్తుకెళ్లిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మధురైకి చెందిన మాయాండి అనే వ్యాపారికి చెందిన బియ్యం గోడౌన్‌కు ఇద్దరు యువకులు వచ్చారు. తమకు 17 బస్తాల బియ్యం కావాలని చెప్పి వాటిని కొనుగోలు చేశారు.
అందుకు సంబంధించిన మొత్తం రూ.34,700 నగదును తమ మొబైల్ ద్వారా ‘గూగుల్ పే’ (G-Pay) చేసేశామని చెబుతూ, ఒక నకిలీ (ఫేక్) పేమెంట్ స్క్రీన్‌షాట్‌ను దుకాణంలో ఉన్న ఉద్యోగికి చూపించారు.
ఆ సమయంలో బ్యాంకు ఖాతాలోకి డబ్బులు నిజంగా క్రెడిట్ అయ్యాయా లేదా అని పూర్తిగా సరిచూసుకోలేకపోయిన ఆ ఉద్యోగి, వారు చూపించిన స్క్రీన్‌షాట్‌ను నమ్మి బియ్యం బస్తాలను వారు తీసుకొచ్చిన వాహనంలోకి ఎక్కించి పంపించేశాడు.
కొద్దిసేపటి తర్వాత యజమాని మాయాండి తన బ్యాంక్ ఖాతాను పరిశీలించగా.. అందులోకి ఎలాంటి డబ్బులు జమ కాలేదని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. తాము మోసపోయామని గ్రహించిన ఆయన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముమ్మర దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply