ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు, నల్లచెరువు ప్రాంతానికి చెందిన నాగలక్ష్మి, సాయి అనే వ్యక్తులకు ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. అయితే మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోయి జీవిస్తున్నారు.
ప్రస్తుతం నాగలక్ష్మి శారదా కాలనీలో సుభాష్ అనే వ్యక్తితో కలిసి సహజీవనం చేస్తోంది. వీరికి మూడేళ్ల ఇషిక అనే ఆడపిల్ల ఉంది. కాగా, గత శనివారం చిన్నారి అపస్మారక స్థితిలో పడిపోయిందని చెబుతూ తల్లి నాగలక్ష్మి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి (GGH) తీసుకెళ్లింది.
చిన్నారిని పరీక్షించిన వైద్యులు పాప అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అంతేకాకుండా చిన్నారి ఒంటినిండా వాతలు, పంటి గాట్లు ఉండటాన్ని గమనించి అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు తల్లిని విచారించగా ఆమె పొంతనలేని సమాధానాలు ఇచ్చింది. అలాగే పోలీసులు కేసు నమోదు చేసి శవపరీక్ష (పోస్ట్మార్టం) నిర్వహించేందుకు సిద్ధమవగా, తల్లి నాగలక్ష్మి, ఆమె ప్రియుడు సుభాష్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగి అడ్డుకునే ప్రయత్నం చేశారు.
దీంతో పోలీసులు నాగలక్ష్మిని గట్టిగా విచారించడంతో అసలు నిజం బయటపడింది. పాప తరచూ మూత్రం పోస్తుండటంతో తీవ్ర కోపానికి గురై తానే వాతలు పెట్టి, పళ్ళతో కొరికి చిత్రహింసలకు గురిచేసినట్లు ఆమె అంగీకరించింది.
ఈ సమాధానంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పోలీసులు, కన్నబిడ్డను కిరాతకంగా పొట్టనబెట్టుకున్న తల్లి నాగలక్ష్మితో పాటు అందుకు సహకరించిన సుభాష్ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించి లోతుగా విచారణ జరుపుతున్నారు.

Leave a Reply