ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలో 35 ఏళ్ల దళిత వ్యక్తి మనోజ్ గౌతమ్‌ను ఆయన భార్య, పదేళ్ల కుమార్తె కళ్లెదుటే ఓ మూక కొట్టి చంపిన ఘటన సోషల్ మీడియాలో తీవ్ర కలకలం రేపింది.
సీతాపూర్ జిల్లా లుధౌరా గ్రామం సమీపంలో గత గురువారం సాయంత్రం మనోజ్ గౌతమ్ తన కుమార్తెతో కలిసి స్థానిక మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, ఒక మూక అకస్మాత్తుగా ఆయనను అడ్డుకుని విచక్షణారహితంగా దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన గౌతమ్‌ను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఆయన మృతదేహం వద్ద భార్యాబిడ్డలు గుండెలవిసేలా రోదిస్తున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటనపై ఇద్దరు మహిళలు సహా ఆరుగురిపై పోలీసులు ప్రథమ సమాచార నివేదిక (FIR) నమోదు చేశారు.
ఈ కేసులో శుభమ్ సింగ్, ధీరేంద్ర సింగ్, నరేంద్ర సింగ్ సహా నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ (పోలీస్ సూపరింటెండెంట్) అగర్వాల్ తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన నిందితుల కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించినట్లు పేర్కొన్నారు. గతంలో నిందితులపై గౌతమ్ ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసినందుకే కక్షగట్టి ఈ దాడికి పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది.

Leave a Reply