భారతదేశం మరియు శ్రీలంకలలో కనిపించే కళ్ళద్దాల ఆకారపు గుర్తు (Spectacled Cobra) కలిగిన నాగుపాముల మధ్య జన్యుపరంగా కీలకమైన తేడాలు ఉన్నట్లు తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది.
‘మాలిక్యులర్ ఫైలోజెనెటిక్స్ అండ్ ఎవల్యూషన్’ (Molecular Phylogenetics and Evolution) అనే ప్రముఖ సైన్స్ జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం, దక్షిణాసియాలో కనిపించే నాగుపాముల పరిణామ క్రమం, వాటి మధ్య గల సంబంధాలపై సమగ్ర పరిశోధన జరిపింది.
భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 67 నాగుపాముల నమూనాలను, ఇతర ప్రాంతాల నుంచి లభించిన జన్యు సమాచారాన్ని శాస్త్రవేత్తలు క్షుణ్ణంగా విశ్లేషించారు. భారతదేశ భూభాగంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించే నాగుపాములలో రంగు, పడగ విప్పే తీరు వంటి శారీరక లక్షణాలు, విష తీవ్రతలో స్వల్ప తేడాలు ఉన్నప్పటికీ.. వాటి మధ్య విస్తృతమైన జన్యు సంకరం (జెనెటిక్ మిక్సింగ్) కొనసాగుతున్నట్లు ఈ అధ్యయనం పేర్కొంది.
అదే సమయంలో, శ్రీలంకలో కనిపించే నాగుపాములు పూర్తిగా భిన్నమైన ప్రత్యేక జన్యు వంశానికి చెందినవని పరిశోధకులు గుర్తించారు. దాదాపు 20 లక్షల సంవత్సరాల క్రితం సముద్ర మట్టాలలో చోటుచేసుకున్న తీవ్ర మార్పుల కారణంగా భారత ఉపఖండానికి, శ్రీలంకకు మధ్య ఉన్న భూభాగ బంధం తెగిపోయిందని.. దీనివల్ల రెండు ప్రాంతాల్లోని నాగుపాములు వేర్వేరుగా పరిణామం చెందడానికి కారణమై ఉండవచ్చని ఈ అధ్యయనం వివరించింది.
దక్షిణాసియాలో కనిపించే అత్యంత ప్రమాదకరమైన విషసర్పాల జాతులలో భారతీయ నాగుపాము ఒకటి. వాటి జన్యు వైవిధ్యాలు, పరిణామ చరిత్రను లోతుగా అర్థం చేసుకోవడం వల్ల సర్ప జాతుల వర్గీకరణ, వాటి సంరక్షణకు సంబంధించిన పరిశోధనలకు ఎంతగానో సహాయపడుతుంది. అయినప్పటికీ, భారతీయ మరియు శ్రీలంక నాగుపాములను అధికారికంగా రెండు వేర్వేరు జాతులుగా వర్గీకరించాలా లేదా అనే తుది నిర్ణయానికి రావడానికి జన్యు సమాచారంతో పాటు మరిన్ని శాస్త్రీయ ఆధారాలు అవసరమవుతాయని నిపుణులు భావిస్తున్నారు.

Leave a Reply