రైలులో ప్రయాణించేటప్పుడు ప్రతి బోగీలోనూ ఎరుపు రంగులో ఉండే అలారం చైన్‌ను మీరు చూసే ఉంటారు. రైలులో ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే దీనిని లాగవచ్చునని చాలా మందికి తెలుసు. అయితే, ఎలాంటి కారణం లేకుండా ఆ చైన్ లాగితే ఏం జరుగుతుందో తెలుసా? జరిమానాతో పాటు జైలు శిక్ష కూడా విధించవచ్చు! ఈ చైన్‌ను ప్రయాణీకుల భద్రత కోసం మాత్రమే ఏర్పాటు చేశారు తప్ప, స్టేషన్ దాటిపోయిందని కిందకు దిగడానికి లేదా రైలు ఎక్కలేకపోయిన స్నేహితుడి కోసం రైలును ఆపడానికి కాదు.
చైన్ లాగితే ఏం జరుగుతుంది?
రైలు ఎమర్జెన్సీ చైన్ లాగినప్పుడు, బ్రేకింగ్ సిస్టమ్‌లో గాలి పీడనం తగ్గి రైలు ఆగిపోయే ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే రైలు ఒక్క క్షణంలోనే ఆగిపోదు. సురక్షితంగా వేగం తగ్గించి ఆపడానికి కొంత దూరం పడుతుంది. ఆ తర్వాత రైల్వే సిబ్బంది ఏ బోగీలో చైన్ లాగారో గుర్తించి, దానికి తగిన కారణాన్ని విచారిస్తారు. రైలును మళ్లీ నడిపే ముందు బ్రేక్ సిస్టమ్‌ను కూడా పూర్తిగా పరిశీలిస్తారు.
ఏ సందర్భంలో చైన్ లాగవచ్చు?
ప్రయాణీకుడికి ప్రాణాపాయం ఉన్న వైద్యపరమైన అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు, ఎవరైనా రైలులో నుంచి యాక్సిడెంటల్‌గా కింద పడిపోయినప్పుడు, అగ్నిప్రమాదం సంభవించినప్పుడు లేదా ప్రయాణీకుల భద్రతకు తక్షణ ముప్పు వాటిల్లినప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ చైన్‌ను ఉపయోగించాలి. అంతేకాని, స్టేషన్ దాటిపోవడం, ఏదైనా వస్తువును మర్చిపోవడం లేదా స్నేహితుడు రైలు ఎక్కలేకపోవడం వంటి కారణాల కోసం చైన్ లాగడం తప్పు. ఇలాంటి పరిస్థితుల్లో తదుపరి స్టేషన్‌లో దిగడం లేదా రైల్వే అధికారుల సహాయం కోరడమే సరైన మార్గం.
చట్టపరమైన శిక్షలు:
అనవసరంగా ఎమర్జెన్సీ చైన్ లాగడం వల్ల ఆ రైలులోని ప్రయాణీకులే కాకుండా, వెనుక వచ్చే ఇతర రైళ్ల సమయపాలన కూడా దెబ్బతింటుంది. ఇండియన్ రైల్వే యాక్ట్, 1989 సెక్షన్ 141 ప్రకారం.. ఎలాంటి సరైన కారణం లేకుండా రైలు కమ్యూనికేషన్ సిస్టమ్‌ను దుర్వినియోగం చేసేవారికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష, రూ.1,000 వరకు జరిమానా లేదా రెండూ విధించవచ్చు. కాబట్టి, ఆ ఎమర్జెన్సీ చైన్‌ను అత్యవసర సమయంలో ప్రాణాలను కాపాడే రక్షణ సాధనంగా మాత్రమే ఉపయోగించాలి.

Leave a Reply