హత్య చేసి 28 ఏళ్లుగా తలదాచుకున్న నిందితుడు.. ఇంటికి వెళ్లిన పోలీసులకు ఎదురైన షాక్..! రైలు ప్రమాపంగా ముగిసిన కేసు.. 28 ఏళ్ల తర్వాత ఎలా చిక్కాడు..?

మహారాష్ట్రలోని థానే జిల్లాలో, 28 సంవత్సరాల క్రితం జరిగిన హత్య కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడిని రైల్వే పోలీసులు బీహార్‌లో అరెస్టు చేశారు.

1998 జనవరి 14న, డాంబివ్లీ మరియు కోపర్ రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలపై ఒక వ్యక్తి మృతదేహం పడి ఉన్నట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. మొదట రైలు ప్రమాదంగా భావించిన ఈ ఘటనపై దర్యాప్తు చేయగా, మృతుడి శరీరంపై ఉన్న గాయాలు, శవం పడి ఉన్న తీరు పోలీసులకు అనుమానం కలిగించాయి. దీంతో ఇది ప్రమాదం కాదని, పథకం ప్రకారమే జరిగిన హత్య అనే కోణంలో దర్యాప్తు ప్రారంభించారు.

విచారణలో మృతుడు 22 ఏళ్ల శైలేష్ మోరేగా గుర్తించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న 55 ఏళ్ల సందీప్ కృష్ణన్‌తో అతనికి ఇప్పటికే పరిచయం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి మధ్య పాత కక్షలు ఉన్నాయని, సందీప్ కృష్ణన్ సోదరిని శైలేష్ మోరే విడాకులు ఇచ్చిన విషయమై వివాదం తలెత్తినట్లు విచారణలో తేలింది. ఘటనకు ముందు ఇద్దరూ కలిసి మద్యం సేవించారని, ఆ సమయంలో జరిగిన గొడవలో శైలేష్ మోరేను గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

హత్య తర్వాత, దానిని రైలు ప్రమాదంగా చిత్రికరించేందుకు శైలేష్ మోరే మృతదేహాన్ని రైలు పట్టాలపై ఉంచి నిందితులు అక్కడి నుంచి పరారైనట్లు విచారణలో తేలింది. ఈ కేసులో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులు చాలా కాలంగా తలదాచుకోవడంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో, కాలం చెల్లిన పాత పెండింగ్ కేసుల్లో మోస్ట్ వాంటెడ్ నిందితుల కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆధునిక నిఘా పద్ధతులు, కాల్ డేటా రికార్డులు (CDR), సెల్ టవర్ లొకేషన్ సమాచారాన్ని విశ్లేషించిన పోలీసులు.. సందీప్ కృష్ణన్ బీహార్‌లో ఉన్నట్లు గుర్తించారు.

దీంతో అక్టోబర్ 18న ప్రత్యేక పోలీసు బృందం బీహార్‌కు వెళ్లి సందీప్ కృష్ణన్‌ను అరెస్టు చేసింది. అక్కడి స్థానిక కోర్టులో హాజరుపరిచి, వేరే రాష్ట్రానికి తీసుకెళ్లేందుకు అనుమతి తీసుకున్నారు. అనంతరం డాంబివ్లీకి తీసుకువచ్చిన అతడిని కోర్టులో హాజరుపరచగా, రెండు రోజులు పోలీస్ కస్టడీకి తరలించారు. ఈ హత్యలో ప్రమేయం ఉన్న ఇతర నిందితుల కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. సుమారు 28 ఏళ్లుగా ఎలాంటి పురోగతి లేని ఈ కేసులో, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో ప్రధాన నిందితుడు చిక్కడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *