నెదర్లాండ్స్ దేశపు పిన్న వయస్కుడైన ప్రధాని రాబ్ జెట్టన్ త్వరలోనే తండ్రి కాబోతున్నాననే సంతోషకరమైన వార్తను పంచుకున్నారు.
తన గే భాగస్వామి, అర్జెంటీనాకు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారుడు నికోలస్ కీనన్తో కలిసి వారు తమ తొలి బిడ్డకు స్వాగతం పలకనున్నారు.
దీనికోసం వారు సరోగసీ (అద్దె గర్భం) పద్ధతిని ఎంచుకున్నారు. రాబోయే 2027లో తమ జీవితంలోకి కొత్త అతిథి రాబోతున్నట్లు రాబ్ జెట్టన్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా అధికారికంగా వెల్లడించారు.
ఈ బిడ్డ కోసం అండాన్ని దానం చేసిన మహిళ, సరోగేట్ తల్లిగా గర్భం దాల్చిన మహిళ మరెవరో కాదు… రాబ్, నికోలస్ జంటకు అత్యంత ఆప్తమిత్రులు! వారికి ఇప్పటికే పిల్లలు ఉన్నారు. ఈ సహాయం వెనుక ఎలాంటి ఆర్థిక ప్రయోజనాలు లేవని, కేవలం స్నేహపూర్వకంగానే వారు దీనికి అంగీకరించారని D66 పార్టీ తెలిపింది.
నెదర్లాండ్స్ దేశ చట్టాల ప్రకారం సరోగేట్ తల్లికి డబ్బులు ఇవ్వడం చట్టవిరుద్ధం. అందువల్ల, దేశ చట్ట నియమ నిబంధనలకు లోబడి, వైద్యుల పర్యవేక్షణలో IVF (సరోగసీ) విధానంలో ఈ కృత్రిమ గర్భధారణ విజయవంతంగా జరిగింది.
తమ జీవితంలోకి కొత్త బిడ్డ రాబోతున్నందుకు రాబ్ జెట్టన్, నికోలస్ కీనన్ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. “మా జీవితంలోకి ఒక ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు. చిన్ని పాపాయి/బాబు… 2027లో నిన్ను కలుస్తాం! మా కోసం అండాన్ని దానం చేసిన మహిళకు, సరోగేట్ తల్లిగా ప్రసవించబోతున్న మైత్రికి, వారి కుటుంబ సభ్యులకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సహాయం లేకపోతే ఇది సాధ్యమయ్యేది కాదు” అని వారు పోస్ట్ చేశారు. బిడ్డ జన్మించిన తర్వాత వారితో సమయం గడిపేందుకు ప్రధాని రాబ్ జెట్టన్ పేరెంట్స్ లీవ్ (తండ్రిగా సెలవు) తీసుకోనున్నారు.
ప్రధాని రాబ్ జెట్టన్, అర్జెంటీనా హాకీ ప్లేయర్ నికోలస్ కీనన్ల నిశ్చితార్థం గత 2024 నవంబర్లో జరిగింది. వీరు 2026 వేసవిలో పెళ్లి చేసుకోవాలని భావించినప్పటికీ, రాబ్ జెట్టన్ దేశ ప్రధాని కావడంతో వివాహం తాత్కాలికంగా వాయిదా పడింది.
ప్రపంచంలోనే తొలిసారిగా 2001లోనే సమలింగ వివాహాలను చట్టబద్ధం చేసిన దేశం నెదర్లాండ్స్ కావడం గమనార్హం. 2025లో జరిగిన ఎన్నికల్లో రాబ్ జెట్టన్ సారథ్యంలోని D66 పార్టీ ఘనవిజయం సాధించింది. దీని ద్వారా 2026 ఫిబ్రవరిలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన జెట్టన్, నెదర్లాండ్స్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానిగా రికార్డు సృష్టించారు. ప్రస్తుతం దేశ ప్రధానిగా విధులు నిర్వర్తిస్తూనే, తండ్రి కాబోయే ఆ ఆనంద క్షణాల కోసం ఆయన ఆతురతగా ఎదురుచూస్తున్నారు.

Leave a Reply