రూ.5 కి కొన్న ఫినాయిల్ రూ.33,500.. రూ.306 LED లైటుకి రూ.11,800! ఇది అచ్చమైన పగటి దోపిడీలా ఉందే.! ప్రభుత్వ వస్తువుల కొనుగోలులో ఇంత పెద్ద మోసమా..?

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో చేపట్టిన ప్రభుత్వ వస్తువుల కొనుగోలు గణాంకాలు అందరినీ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.

ఒకే రకమైన వస్తువులకు వేర్వేరు ప్రాంతాల్లో దారుణంగా ధరలు నిర్ణయించిన వ్యవహారం ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది.

అంటే.. ఒక లీటర్ ఫినాయిల్ కొన్ని ప్రాంతాల్లో కేవలం రూ.5 లకే కొనుగోలు చేశారు. కానీ, సరిగ్గా అలాంటి మరో ఫినాయిల్ కోసం ఏకంగా రూ.33,500 వరకు ఖర్చు చేశారు! అలాగే 60 వాట్ల సామర్థ్యం ఉన్న ఒక LED లైటును కొన్ని చోట్ల రూ.306 కి కొనుగోలు చేయగా, భోపాల్‌లో ఇదే సామర్థ్యం ఉన్న లైటు ధరను రూ.11,800 గా నమోదు చేశారు. ఒక్క భోపాల్‌లోనే ఈ కొనుగోలు కోసం రూ.3.78 లక్షలు ఖర్చు చేయడం గమనార్హం.

చెత్త సేకరించే లారీల కొనుగోలులో కూడా రూ.2 లక్షల నుండి రూ.6 లక్షల వరకు భారీ స్థాయిలో ధరల వ్యత్యాసం ఉన్నట్లు గుర్తించారు. మధ్యప్రదేశ్‌లోని 374 పట్టణ స్థానిక సంస్థలు గడిచిన 3 ఏళ్లలో ‘గవర్నమెంట్ ఇ-మార్కెట్‌ప్లేస్’ (GeM) పోర్టల్ ద్వారా సుమారు రూ.1,134 కోట్ల విలువైన వస్తువులను కొనుగోలు చేశాయి. ఈ కొనుగోళ్లను పరిశీలించగా, సగటు మార్కెట్ ధరలకు వస్తువులను కొనుగోలు చేసి ఉంటే ప్రభుత్వానికి దాదాపు రూ.250 కోట్ల వరకు ఆదా అయ్యేదని అంచనా వేశారు.

పట్టణాభివృద్ధి, పాలనా శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి సంజయ్ దూబే.. ఈ కొనుగోలు విధానంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెచ్చరించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తోంది. అసాధారణ ధరలు, కొనుగోళ్లలో జరిగే అక్రమాలను ఇకపై ఎంతమాత్రం సహించేది లేదని ఆయన అధికారులను తీవ్రంగా హెచ్చరించారు.

ఈ వ్యవహారంపై మాట్లాడిన పట్టణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి ప్రతిమా బాక్రీ.. వైరల్ అవుతున్న వీడియో మరియు కొనుగోలు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా, కాంగ్రెస్ పాలనలో అవినీతిని పట్టించుకోకుండా వదిలేశారని, కానీ బీజేపీ పాలనలో ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నాయకత్వంలో అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నామని ఆమె స్పష్టం చేశారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *