థాయిలాండ్‌లో ఓ వ్యక్తి ఫేస్బుక్లో పంచుకున్న ఫోటో, సుమారు 12 కోట్ల సంవత్సరాల క్రితం నాటి డైనోసార్ల జీవనశైలికి సంబంధించిన కీలక ఆధారాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది.
ఉడోన్ థాని ప్రావిన్స్‌లోని ఫూ ఫ్రాబాట్ (Phu Phra Bat) నేషనల్ పార్క్‌కు వెళ్లిన 32 ఏళ్ల పిచాయ్ ప్రదెత్సేనా అక్కడి రాళ్లపై వింతైన గుర్తులను గమనించాడు.
వాగులో నీరు తగ్గడంతో రాళ్లు బయటకు కనిపించాయి. దీంతో ఆ గుర్తులను ఫోటో తీసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాడు. అతడి పోస్ట్ అధికారుల దృష్టిని ఆకర్షించడంతో, థాయిలాండ్ ఖనిజ వనరుల శాఖ అధికారులు ఆ ప్రాంతాన్ని పరిశీలించారు.
ఆ పరిశీలనలో రాళ్లపై కనిపించినవి సాధారణ గుర్తులు కావని, సుమారు 12 కోట్ల సంవత్సరాల నాటి ఆరు డైనోసార్ పాదముద్రలని తేలింది. ప్రతి పాదముద్ర సుమారు 29 సెంటీమీటర్ల పొడవు, 26 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నట్లు వెల్లడించారు. రెండు కాళ్లపై నడిచే, ప్రధానంగా మాంసాహారులైన ‘థెరోపాడ్’ (Theropod) జాతి డైనోసార్లు ఈ పాదముద్రలను ఏర్పరిచి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఆ కాలంలో జీవించిన డైనోసార్ల సంచారం, వాటి శారీరక కదలికల గురించి పరిశోధించేందుకు కొత్త అవకాశాన్ని కల్పించింది.
ఈ శిలాజ పాదముద్రలు దెబ్బతినకుండా కాపాడే ఉద్దేశంతో ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సందర్శకులు ఆ పాదముద్రలపై నడవకూడదని, తాకకూడదని, రాళ్లను తవ్వకూడదని ఆంక్షలు విధించారు. కోట్లాది సంవత్సరాల క్రితం భూమిపై నివసించిన జీవుల కదలికలను అర్థం చేసుకోవడానికి తోడ్పడే ఇలాంటి ఆవిష్కరణలు, చరిత్ర పూర్వపు ప్రపంచంపై జరిగే పరిశోధనల్లో ఎంతో కీలకమైనవి. ఒక సాధారణ ఫోటో భూమి ప్రాచీన చరిత్రకు సంబంధించిన అరుదైన సమాచారాన్ని బయటపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

Leave a Reply