బ్రిటన్‌లో తనతో పాటు ఒకే ఇంట్లో ఉంటున్న 21 ఏళ్ల యువకుడిని 30 సార్లు కత్తితో పొడిచి చంపిన 23 ఏళ్ల జాక్ కఫ్లాన్కు యావజ్జీవ కారాగార శిక్ష పడింది.
అతను కనీసం 28 ఏళ్లు జైలులో ఉండాలని కోర్టు ఆదేశించింది. బ్రిస్టల్ క్రౌన్ కోర్టులో జరిగిన విచారణలో, జాక్ తన ఇంట్లో అద్దెకు ఉంటున్న జేమీ కాలిన్స్‌ను హత్య చేయడమే కాకుండా, ఆధారాలను మాయం చేసేందుకు ప్రయత్నించినట్లు తేలింది.
గత ఏప్రిల్ 8వ తేదీన ఫిల్టన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. జేమీ ఇంటికి తిరిగి రావడం కోసం ఇంటి తోట సమీపంలోని వీధిలో వేచి చూసిన జాక్, అతను రాగానే దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. హత్య తర్వాత సుమారు ఎనిమిది గంటల పాటు జేమీ మృతదేహం ఉన్నచోటే గడిపిన అతను, ఆ తర్వాత పోలీసులను సంప్రదించాడు. జేమీ సైకిల్‌ను తీసుకెళ్లి సమీపంలోని ఓ షాపింగ్ మాల్ ప్రాంతంలో వదిలేసి, దాడి సమయంలో రక్తం అంటిన తన దుస్తులను ఒక చెరువులో పడేశాడు. అవి నీటిలో మునిగిపోవాలనే ఉద్దేశంతో ఆ బ్యాగ్‌లో ఇటుకలు కూడా పెట్టినట్లు సమాచారం.
హత్య తర్వాత జాక్ ఇంటికి వెళ్లి పిజ్జా తింటూ, వీడియో గేమ్స్ ఆడాడు. ఇంట్లో అతను ఏర్పాటు చేసుకున్న సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు విచారణలో కీలక ఆధారంగా మారాయి. జేమీ మృతదేహం ఆ తర్వాతే దొరికినట్లు నమ్మించేందుకు జాక్ ప్రయత్నించాడని, ఆ సీసీటీవీ దృశ్యాలను ఐదుసార్లు చూశాడని కోర్టుకు తెలిపారు. మొదట హత్య ఆరోపణలను ఖండించిన అతను, ఆ తర్వాత నేరాన్ని అంగీకరించాడు. జేమీ తనపై దాడి చేస్తాడనే భయంతోనే అలా చేశానని అతను చెప్పాడు; కానీ అతని వాదనలను న్యాయమూర్తి అంగీకరించలేదు.
ఇద్దరి మధ్య అద్దెకు సంబంధించిన సమస్య, రాజకీయ విభేదాలు ఉన్నట్లు విచారణలో తేలింది. అయినప్పటికీ, హత్యకు కచ్చితమైన కారణం ఇదేనని నిర్ధారించలేకపోయారు. ఫోరెన్సిక్ ఆధారాలు, సీసీటీవీ దృశ్యాలు జాక్‌ను ఈ నేరంతో ముడిపెట్టాయి. జేమీ సామాజిక సమస్యలపై ఆసక్తి ఉన్న యువకుడని, ఈ హత్యను ముందుగానే ప్లాన్ చేసి ఉండొచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో జాక్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించడంతో పాటు, కనీసం 28 ఏళ్లు జైలులోనే ఉండాలని తీర్పునిచ్చారు.

Leave a Reply