“రాత్రి సమయం”. అకస్మాత్తుగా కుప్పకూలిన గేటు.. 3 గంటల పాటు చిక్కుకుపోయిన 55 ఏళ్ల వాచ్‌మెన్.. 600 కిలోల బరువు కింద నలిగిపోయి ప్రాణాలు విడిచిన వైనం.. అపార్ట్‌మెంట్‌లో జరిగిన భయానక ఘటన.!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్ జిల్లా పంకీ (Panki) ప్రాంతంలోని ‘శ్రీ ప్రభు విస్టా’ అపార్ట్‌మెంట్‌లో 55 ఏళ్ల విక్రమ్ సింగ్ నైట్ వాచ్‌మెన్‌గా (నైట్ గార్డ్) పనిచేస్తున్నాడు.

ఘటన జరిగిన రోజు అర్ధరాత్రి సమయంలో అతను తన విధులు నిర్వర్తిస్తుండగా, సుమారు 600 కిలోల బరువున్న ఓ పెద్ద ఇనుప స్లైడింగ్ గేటు అకస్మాత్తుగా అతనిపై పడిపోయింది. దీంతో గేటు కింద చిక్కుకుపోయిన అతను బయటకు రాలేక తీవ్రంగా తల్లడిల్లాడు.

రాత్రి సమయంలో జరిగిన ఈ ప్రమాదం వెంటనే ఎవరికీ తెలియకపోవడంతో, సుమారు మూడు గంటలకు పైగా అతను గేటు కిందే పడి ఉన్నాడు. ఆ తర్వాత శనివారం తెల్లవారుజామున 4:30 గంటల ప్రాంతంలో ఆ అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ ఉపాధ్యాయుడు అతనిని గమనించి, వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని గేటును తొలగించి చూసేసరికి, అప్పటికే విక్రమ్ సింగ్ ప్రాణాలు కోల్పోయినట్లు తేలింది.

ప్రాథమిక విచారణ ప్రకారం.. గేటుకు ఉన్న స్టాపర్లు (Stoppers) అరిగిపోవడం, గేటు పట్టాలు తప్పి కింద పడకుండా ఆపే క్లాంప్ బోర్డును (Clamp board) అమర్చకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని తెలిసింది. గేటు మరమ్మతులు చేయాలని గతంలో పనిచేసిన మరో వాచ్‌మెన్ హెచ్చరించినప్పటికీ యాజమాన్యం పట్టించుకోలేదని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపించారు. దీంతో విక్రమ్ మృతదేహం స్వగ్రామానికి చేరుకోగానే, అపార్ట్‌మెంట్ యాజమాన్యం నిర్లక్ష్యాన్ని ఖండిస్తూ.. నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ బంధువులు నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

ఈ క్రమంలో పంకీ పోలీస్ స్టేషన్ ఏసీపీ అమిత్ కుమార్ చౌరాసియా ఇరువర్గాలను పిలిపించి చర్చలు జరిపారు. అపార్ట్‌మెంట్ యాజమాన్యం, నివాసితుల నుంచి సేకరించిన లక్ష రూపాయల పరిహారాన్ని బాధిత కుటుంబానికి అందజేశామని, దీంతో ఇరువర్గాల మధ్య సానుకూల ఒప్పందం కుదిరిందని పోలీసులు తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *