ఫ్రాన్స్ దేశం పారిస్ శివారు ప్రాంతమైన ట్రాప్స్ (Trappes)లో కారులో వచ్చిన ఓ గుర్తుతెలియని వ్యక్తి జరిపిన దారుణమైన కాల్పుల్లో, ప్రముఖ వర్ధమాన మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ (MMA) క్రీడాకారుడు ప్రాణాలు కోల్పోయాడు.
అలాగే 12 ఏళ్ల బాలిక సహా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జాత్యహంకారం, ఇస్లామోఫోబియా ప్రేరేపిత ఉగ్రవాద దాడి అని ఫ్రాన్స్ అధికారులు నిర్ధారించారు.
గత శుక్రవారం ఉదయం, 39 ఏళ్ల కెవిన్ డి (Kevin D) అనే వ్యక్తి, తన కారులో ఉంటూనే మిలిటరీ గ్రేడ్ తుపాకీతో సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఇందులో ఆఫ్రికన్ సంతతికి చెందిన 26 ఏళ్ల యువ ఎంఎంఏ (MMA) ఫైటర్ బెంగో బోసియో వాంగి (Bengo Bosio Vangi) అక్కడికక్కడే దారుణంగా మృతి చెందాడు. ఎనిమిది సార్లు తుపాకీ బుల్లెట్లకు గురైన 12 ఏళ్ల బాలికతో పాటు మరో ఐదుగురు తీవ్ర గాయాలతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU)లో చికిత్స పొందుతున్నారు. దాడి జరిగిన 15 నిమిషాల్లోనే భద్రతా బలగాలు నిందితుడిని అరెస్టు చేశాయి.
ఈ ఘటనపై స్పందించిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్.. ‘ఇది పూర్తిగా జాత్యహంకార ఆధారిత ఉగ్రవాద దాడి. బాధితుల చర్మం రంగు, మతం ఆధారంగానే వారిని లక్ష్యంగా చేసుకున్నారు. ఫ్రాన్స్‌లో ఇలాంటి వాటికి తావు లేదు’ అని స్పష్టం చేశారు. అలాగే, అరెస్టయిన వ్యక్తి నివాసంలో తనిఖీలు చేపట్టగా.. అక్కడ బాంబులు తయారు చేయడానికి సంబంధించిన సామగ్రితో పాటు అడాల్ఫ్ హిట్లర్ రాసిన ‘మెయిన్ కాంఫ్’ (Mein Kampf) పుస్తకాన్ని కూడా దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ ఘటనను ఖండిస్తూ, నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ఫ్రాన్స్ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు (నిరసనలు) చేపడుతున్నారు. ఈ క్రూరమైన దాడి ఘటన యావత్ ఫ్రాన్స్ దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహ జ్వాలలను రేకెత్తించింది.

Leave a Reply