బ్రెజిల్‌లోని సావో పాలో (Sao Paulo) నగరంలో నిర్మాణ పనులకు ఉపయోగిస్తున్న క్రేన్‌ను మోనోరైలు ఢీకొన్న ప్రమాదం తీవ్ర కలకలం రేపింది.
అక్టోబర్ 24 శనివారం రోజున నగరంలోని తూర్పు భాగంలో ఉన్న విలా ప్రుడెంటె (Vila Prudente) ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. లైన్ 15-సిల్వర్ మార్గంలో వెళ్తున్న మోనోరైలు.. ట్రాక్‌కు అడ్డంగా పడిన క్రేన్‌ను ఢీకొన్నట్లు సమాచారం. ఈ దాడికి భారీ యంత్రానికి (క్రేన్‌కు) సంబంధించిన కొన్ని భాగాలు విరిగిపోయి, రైలు మార్గం కింద వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించే రోడ్డుపై పడ్డాయి.
ఈ ప్రమాదం ‘అవెనిడా ప్రొఫెసర్ లూయిజ్ ఇగ్నాసియో డి అన్హాయా మెల్లో’ (Avenida Professor Luiz Ignacio de Anhaia Mello) అనే అత్యంత రద్దీగా ఉండే రహదారి పైన జరిగింది. ఆ సమయంలో రోడ్డుపై కార్లు, ద్విచక్ర వాహనాలు, పాదచారులు వెళ్తుండగా, పైనుంచి యంత్రం విరిగిన భాగాలు కింద పడటంతో అత్యంత ప్రమాదకర వాతావరణం నెలకొంది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియోలో.. రైలు క్రేన్‌ను సమీపించి ఢీకొట్టడం, ఆ ధాటికి యంత్రం భాగాలు విరిగి కింద పడటం రికార్డైనట్లు వార్తలు తెలుపుతున్నాయి. అయితే, రోడ్డుపై ట్రాఫిక్ ఉన్నప్పటికీ వాహనదారులకు గానీ, పాదచారులకు గానీ ఎలాంటి గాయాలు కాలేదని సమాచారం.
ఈ ఘటనలో క్రేన్‌ను నడుపుతున్న ఆపరేటర్ గాయపడ్డాడు. సమాచారం అందిన వెంటనే అత్యవసర సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని అతన్ని రక్షించాయి. ప్రమాద తీవ్రత, రోడ్డుపై యంత్రాల భాగాలు పడిన తీరు చూస్తుంటే ఆ ప్రాంతంలో ప్రజల భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
రైలు పట్టాలపై పడిన క్రేన్‌ను మోనోరైలు ఢీకొట్టకముందే రైలును ఎందుకు ఆపలేకపోయారనే దానిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైలు సరైన సమయంలో బ్రేక్ వేయలేకపోయిందని ప్రాథమిక సమాచారం చెబుతున్నా, అసలు అలా ఎందుకు జరిగిందన్న దానికి కచ్చితమైన వివరణ వెలువడలేదు. క్రేన్ ట్రాక్‌పైకి ఎలా పడింది, రైలు డ్రైవర్‌కు దాన్ని ముందుగానే గమనించే అవకాశం ఉందా, బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గానే పనిచేసిందా అనే విషయాలు విచారణలో తేలనున్నాయి. ప్రమాదానికి గల పూర్తి కారణాలు నిర్ధారించే వరకు, రైలు మరియు నిర్మాణ పనుల భద్రతకు సంబంధించిన ప్రశ్నలు ఉత్పన్నమవుతూనే ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు.

Leave a Reply