సౌదీ అరేబియాలో క్షిపణులు (మిస్సైళ్లు), డ్రోన్ దాడులకు సంబంధించిన సంఘటనలను భారతీయులు ఎవరూ తమ సెల్ఫోన్లలో వీడియోలు తీయడం (రికార్డ్ చేయడం) లేదా సోషల్ మీడియాలో షేర్ చేయడం లాంటివి చేయవద్దని రియాద్‌లోని భారత రాయబార కార్యాలయం (ఎంబసీ) తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
యెమెన్‌లో 2015 నుంచి అంతర్యుద్ధం తీవ్రమవుతోంది. రాజధాని సనాను హౌతీ తిరుగుబాటుదారులు చేజిక్కించుకోవడంతో, సౌదీ అరేబియా, పాశ్చాత్య దేశాల మద్దతుతో యెమెన్ ప్రభుత్వం ఏడెన్ నగరాన్ని తాత్కాలిక రాజధానిగా చేసుకుని కార్యకలాపాలు సాగిస్తోంది. అయితే, యెమెన్‌ను పూర్తిగా హస్తగతం చేసుకునే లక్ష్యంతో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు నిరంతరం దాడులు చేస్తున్నారు. తమకు అడ్డుకట్ట వేస్తున్న సౌదీ అరేబియాకు చెందిన విమానాశ్రయాలు, చమురు శుద్ధి కర్మాగారాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్లు, క్షిపణులతో వారు దాడులను తీవ్రతరం చేశారు.
ముఖ్యంగా, సౌదీ రాజధాని రియాద్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన దారుణ దాడిలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. గత సెప్టెంబర్ నెల నుంచి సౌదీ అరేబియా, హౌతీ బలగాల మధ్య ఘర్షణలు తారాస్థాయికి చేరుకోగా, సాధారణ పౌరులు నివసించే మౌలిక సదుపాయాలను సైతం లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతుండటంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈ నేపథ్యంలో, సౌదీ అరేబియా సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ జారీ చేసిన హెచ్చరికను ప్రస్తావిస్తూ భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు చేసింది. అందులో.. “సౌదీ అరేబియాలో నివసిస్తున్న భారతీయులు ఆ దేశ చట్టాలను, నిబంధనలను విధిగా పాటించాలి. క్షిపణులు లేదా డ్రోన్లను ఆ దేశ బలగాలు అడ్డగించి ధ్వంసం చేసే దృశ్యాలను సెల్ ఫోన్లలో చిత్రీకరించడం, వాటికి సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేయడం లేదా షేర్ చేయడం లాంటి పనులకు పూర్తిగా దూరంగా ఉండాలి. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై సౌదీ చట్టాల ప్రకారం అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటారు” అని స్పష్టం చేసింది.

Leave a Reply