చైనాలోని నాన్జింగ్ యూనివర్సిటీలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ఓ విభిన్నమైన శిక్షణా తరగతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
ఇతరులతో మాట్లాడే నైపుణ్యాన్ని పెంపొందించడమే కాకుండా, వారి భావాలను అర్థం చేసుకోవడానికి కూడా ఈ శిక్షణ ఎంతగానో సహాయపడుతుంది. ఇందుకోసం విద్యార్థులు అపరిచిత వ్యక్తులకు (తెలియని నంబర్లకు) ఫోన్ చేసి వారిని ఇంటర్వ్యూ చేయాలనే అసైన్మెంట్ ఇస్తారు. వినడానికి సులభంగా అనిపించినా, నేటి పరిస్థితుల్లో తెలియని నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను చాలామంది కట్ చేస్తుండటంతో, విద్యార్థులకు ఇదొక సవాలుగా మారింది.
జియాంగ్సు ప్రావిన్స్‌లో ఉన్న నాన్జింగ్ యూనివర్సిటీలో.. మాజీ టెలివిజన్ షో నిర్మాత, దర్శకుడు అయిన షు కాయ్ 2015లో ‘ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ (మౌఖిక భావవ్యక్తీకరణ నైపుణ్యాలు)’ పేరుతో ఈ కోర్సును ప్రారంభించారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం, సంభాషణ నైపుణ్యాలను మెరుగుపరచడం, ఇతరులు చెప్పేది ఓపికగా వినడం, వారి భావోద్వేగాలను అర్థం చేసుకోవడమే దీని ప్రధాన ఉద్దేశ్యం. కాలక్రమేణా ఈ కోర్సు యూనివర్సిటీలో అత్యంత ప్రజాదరణ పొందిన తరగతుల్లో ఒకటిగా మారింది.
ఈ కోర్సులో పాల్గొన్న కొన్నీ అనే విద్యార్థిని, ముందుగా సోషల్ మీడియా ద్వారా సహాయం అర్థిస్తూ పరిచయం లేని వారితో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఆ తర్వాత నాన్జింగ్ నగరంలో కొన్ని తెలియని ఫోన్ నంబర్లకు కాల్ చేయాలని నిర్ణయించుకుంది. కానీ, వారిలో చాలామంది ఆమెను మోసగించే వ్యక్తి (స్కామర్) అనుకుని కాల్ కట్ చేసినట్లు తెలిపింది. అదేవిధంగా, హాంగ్ యిమింగ్ అనే విద్యార్థి 30 మందికి పైగా కాల్ చేయగా, కేవలం ఐదుగురు మాత్రమే ఫోన్ లిఫ్ట్ చేశారు. వారిలో ముగ్గురు వెంటనే కాల్ కట్ చేయగా, మరొకరు అతడిని సైబర్ మోసగాడిగా అనుమానించారు. చివరగా ఇంటర్వ్యూకి అంగీకరించిన ఐటీ (IT) రంగానికి చెందిన ఓ వ్యక్తి, తన పని అనుభవాన్ని, కెరీర్‌కు సంబంధించిన సలహాలను, నాన్జింగ్ నగరంలో తన ఖాళీ సమయాన్ని ఎలా గడుపుతాడనే విషయాలను పంచుకున్నాడు. తన రెండు పెంపుడు పిల్లుల గురించి కూడా ఆ విద్యార్థితో మాట్లాడాడు.
గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే మోసపూరిత కాల్స్ పట్ల ప్రజల్లో భయం పెరగడంతో, ఈ అసైన్మెంట్ను పూర్తి చేయడం విద్యార్థులకు కష్టంగా మారింది. కొందరు శిక్షణ పూర్తయిన తర్వాత కూడా దీన్ని కొనసాగించడానికి ఆసక్తి చూపగా, మరికొందరు కష్టంగా అనిపించి ఈ కోర్సు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. షు కాయ్ అభిప్రాయం ప్రకారం.. ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశ్యం కేవలం మాట్లాడటం నేర్చుకోవడమే కాదు, ఇతరులు మనకోసం తమ సమయాన్ని కేటాయించినప్పుడు ఆ సమయం విలువను అర్థం చేసుకోవడం కూడా. చిన్నప్పటి నుంచే తక్కువగా మాట్లాడాలనే ఆలోచన చాలా మంది యువతలో నాటుకుపోయిందని చెబుతున్న ఆయన.. సంభాషణల ద్వారా తమ అభిప్రాయాలను వ్యక్తపరచడం, ఇతరుల అనుభవాలను విని అర్థం చేసుకోవడం విద్యార్థులు అలవాటు చేసుకోవాలని నొక్కి చెప్పారు.

Leave a Reply