“రూ.10 లక్షలు ఇవ్వకపోతే షూటౌట్”. నువ్వు బీజేపీలో పోటీ చేయడానికి మళ్లీ టికెట్ అడగకూడదు. నీ కొడుకులపై లైంగిక దాడి కేసులు పెట్టి లోపల వేయిస్తా. మాజీ ఎమ్మెల్యేకు పోస్టులో వచ్చిన బాంబు బెదిరింపుతో కలకలం.!

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్‌పూర్ జిల్లా దేవ్‌బంద్ నియోజకవర్గ మాజీ బీజేపీ ఎమ్మెల్యే శశిబాలా పుండిర్‌కు స్పీడ్ పోస్ట్ ద్వారా ఒక షాకింగ్ బెదిరింపు లేఖ రావడం తీవ్ర కలకలం రేపుతోంది.

అందులో, వచ్చే 2027 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేయడానికి అవకాశం అడిగితే, ఆమె ఇంటిని బాంబులతో పేల్చేస్తామని, ప్రజల ఫిర్యాదులు వినడం వెంటనే ఆపేయాలని బెదిరించారు.

ఆ లేఖలో, “నేను ఒక గ్యాంగ్‌స్టర్‌ను. శశిబాలా జీ, నాకు రూ.10 లక్షలు ఇవ్వాలి, లేదంటే నిన్ను కాల్చి చంపేస్తాను. మొదటి విడతగా రూ.1 లక్షను గూగుల్ పే ద్వారా వెంటనే పంపాలి. 1991 నుంచి 1996 వరకు ఎమ్మెల్యేగా ఉన్నది చాలు, మళ్లీ అవకాశం అడగకూడదు” అని పేర్కొన్నారు. అంతేకాకుండా, డబ్బులు ఇవ్వకపోతే ఆమె కొడుకులపై నకిలీ లైంగిక దాడి కేసులు నమోదు చేస్తామని, చనిపోయిన ఆమె దత్తపుత్రుడి గురించి అబద్ధాలు ప్రచారం చేస్తామని బెదిరించారు. బెదిరింపులకు పాల్పడిన వ్యక్తి తనను తాను ‘మంగళ్’ అని, రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందినవాడినని తెలుపుతూ, శ్రీగంగానగర్ చిరునామాను కూడా పేర్కొన్నాడు.

ఈ బెదిరింపు లేఖపై మాజీ ఎమ్మెల్యే శశిబాలా పుండిర్ మాట్లాడుతూ, “నేను వీర రాజ్‌పుత్ సామాజిక వర్గానికి చెందిన బిడ్డను. ఇలాంటి బెదిరింపులకు భయపడను. నేను ఎలాంటి ఆయుధాలు లేకుండా ఒంటరిగానే ప్రయాణిస్తాను. ప్రజాసేవను కొనసాగిస్తాను” అని ధైర్యంగా సమాధానమిచ్చారు. ఈ ఘటనపై ఇప్పటివరకు అధికారికంగా పోలీసులకు ఫిర్యాదు చేయలేదని తెలుస్తోంది. అయినప్పటికీ, ఒక మాజీ మహిళా ప్రజాప్రతినిధికి పోస్ట్ ద్వారా బెదిరింపులు రావడం ఆ ప్రాంతంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *