కర్ణాటక రాష్ట్రానికి చెందిన 2 ఏళ్ల చిన్నారి, తబలాపై 12 రకాల తాళాలను పలికిస్తూ, వాయిస్తూ రికార్డు సృష్టించింది.
ఇంకా మూడేళ్లు కూడా నిండని వయసులో, తన సంగీత ప్రతిభతో పలువురి దృష్టిని ఆకర్షించిన ఈ చిన్నారి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది. ఆమె ప్రతిభను చూపే వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లా, హొన్నావర్‌కు చెందిన ఈ చిన్నారి పేరు స్వర్శ్రీ హెగ్డే. ఆమె వయసు ప్రస్తుతం 2 ఏళ్ల 10 నెలలు. ఈ వయసులోనే తబలాపై వేర్వేరు తాళాలను గుర్తించి, వాటిని చెబుతూ వాయించి చూపించడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
స్వర్శ్రీ తబలా వాయిస్తున్న వీడియో ఎక్స్ (X) ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయబడిన తర్వాత, పలువురు చిన్నారి ప్రతిభను కొనియాడుతున్నారు. ఇంత చిన్న వయసులోనే సంగీతంపై ఇంతటి ఆసక్తిని, ప్రతిభను కనబరుస్తున్న ఈమెను వండర్ కిడ్ అని ప్రశంసిస్తున్నారు. ఈ చిన్నారి ఉత్తర కన్నడ జిల్లాకు గర్వకారణంగా నిలిచిందని పలువురు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.
తబలా వాయించడం అంటే కేవలం చేతులతో వాయిద్యాన్ని తట్టడం మాత్రమే కాదు; తాళంపై అవగాహన, చేతుల సమన్వయం, సమయ నియంత్రణ (టైమింగ్) కూడా ఎంతో అవసరం. మూడేళ్లు నిండక ముందే 12 తాళాలను చెబుతూ వాయించిన స్వర్శ్రీ రికార్డు.. చిన్న వయసులోనే పిల్లల్లో ఉన్న సంగీత ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తోంది.

Leave a Reply