ఐటీ ఉద్యోగులకు మరోసారి ఉద్యోగ భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే ఒకేరోజు సుమారు 550 మంది ఉద్యోగులను తొలగించినట్లు ‘ఇన్నోడేటా’ (Innodata) సంస్థకు సంబంధించి తమిళ కథనం పేర్కొంది. అకస్మాత్తుగా ల్యాప్‌టాప్‌లు, అధికారిక ఈమెయిల్ ఖాతాలు పనిచేయకపోవడంతో ఉద్యోగులు తీవ్ర గందరగోళానికి గురైనట్లు తెలిపింది.
ల్యాప్‌టాప్ పనిచేయకపోవడంతో అనుమానం!
తమిళ కథనం ప్రకారం.. ఉద్యోగులు ఎప్పటిలాగే కార్యాలయానికి వచ్చి తమ పనులు ప్రారంభించారు. అయితే, మధ్యాహ్నం సమయంలో కొందరి ల్యాప్‌టాప్‌లు, అధికారిక ఈమెయిల్ ఖాతాలు అకస్మాత్తుగా లాక్ అయ్యాయి. దీంతో ఏం జరిగిందో తెలియక ఉద్యోగులు తమ మేనేజర్లను సంప్రదించేందుకు ప్రయత్నించారు.
అయితే, హెచ్ఆర్ పోర్టల్‌లో తమ చివరి పని రోజు అదే రోజుగా పేర్కొనడం చూసి వారు షాక్‌కు గురైనట్లు కథనం వెల్లడించింది. ముందస్తు హెచ్చరిక లేకుండా వ్యక్తిగత ఈమెయిల్ చిరునామాలకు ఉద్యోగ తొలగింపు లేఖలు పంపినట్లు కూడా పేర్కొంది.
జీతం వివరాలు కూడా డౌన్లోడ్ చేసుకోలేకపోయారా?
సంస్థ వ్యాపార, కార్యకలాపాల అవసరాల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తొలగింపు లేఖల్లో పేర్కొన్నారని కథనం తెలిపింది. అయితే, ఉద్యోగులు తమ జీతానికి సంబంధించిన వివరాలు, ఇతర ముఖ్యమైన పత్రాలను డౌన్లోడ్ చేసుకునేందుకు కూడా తగిన సమయం లభించలేదని ఆరోపించింది.
ఈ పరిణామంతో బాధిత ఉద్యోగులు వాట్సాప్ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని తమ పరిస్థితులను పంచుకున్నట్లు సమాచారం. ఆ గ్రూపులో 500 మందికి పైగా చేరినట్లు తమిళ కథనం పేర్కొంది.
ఇతర దేశాల్లోనూ ఉద్యోగుల తొలగింపు?
భారత్‌తో పాటు ఫిలిప్పీన్స్‌లోని కొన్ని విభాగాల్లోనూ ఉద్యోగుల తొలగింపులు జరిగినట్లు ఆ కథనం వెల్లడించింది. అయితే, ఏయే విభాగాల్లో ఎంతమందిని తొలగించారు, సంస్థ అధికారికంగా ఏమి ప్రకటించింది అనే వివరాలు ఇందులో స్పష్టంగా లేవు.
ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపులు మరోసారి ఉద్యోగ భద్రత, ఆర్థిక ప్రణాళికలపై చర్చకు దారితీస్తున్నాయి. ఉద్యోగం ఉన్నప్పుడే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం, కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం, ప్రత్యామ్నాయ ఉద్యోగ అవకాశాలపై దృష్టి పెట్టడం ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.

Leave a Reply