“ప్రయాణికులకు కలిగిన మానసిక క్షోభ.. రైల్వే చెప్పిన అబద్ధం.. బయటపెట్టిన ఆధారాలు!” భారతీయ రైల్వేకు కోర్టు ఇచ్చిన సంచలన తీర్పు.!!

రైలులో నీటి వసతి లేకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడిన ప్రయాణికుడికి రూ. 16,000 పరిహారం చెల్లించాలని నైరుతి రైల్వే (South Western Railway) యాజమాన్యాన్ని కర్ణాటక వినియోగదారుల కోర్టు ఆదేశించింది.

కర్ణాటకకు చెందిన ఒక ప్రయాణికుడు తన కుటుంబ సభ్యులు 24 మందితో కలిసి తిరుపతికి వెళ్లి, తిరిగి బెంగళూరులోని యశ్వంత్‌పూర్ నుండి శివమొగ్గకు రైలులో ప్రయాణించారు. ప్రయాణ సమయంలో రైలు మరుగుదొడ్లలో నీళ్లు లేకపోవడంతో, ఆయన, ఆయన కుటుంబ సభ్యులు మార్గమధ్యంలోనే రైలు దిగిపోయి, అదనపు డబ్బులు చెల్లించి వేరే రైలులో వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది.

మరుగుదొడ్లలో నీళ్లు లేకపోవడంపై రైలులోని అధికారులకు, తదుపరి రైల్వే స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు ఆ ప్రయాణికుడు తెలిపాడు. అయితే, రైల్వే యాజమాన్యం ఈ ఆరోపణలను ఖండించింది. రైలు బయలుదేరే ముందే తగినంత నీటిని నింపామని, ఎలాంటి ఫిర్యాదూ నమోదు కాలేదని కోర్టులో వాదించింది. అయినప్పటికీ, ప్రయాణికుడు సమర్పించిన ప్రయాణ టిక్కెట్లు, అతను ఇచ్చిన ఫిర్యాదు పత్రం కాపీని వినియోగదారుల కోర్టు బలమైన ఆధారాలుగా స్వీకరించింది.

మరుగుదొడ్లలో నీళ్లు ఉన్నాయని నిరూపించే సరైన ఆధారాలను సమర్పించడంలో రైల్వే విఫలమైందని, ప్రయాణికులు ఫిర్యాదు చేసినా ఆ సమస్యను పరిష్కరించలేదని కోర్టు ఎత్తిచూపింది. దీని వల్ల ప్రయాణికుడికి, అతని కుటుంబానికి మానసిక క్షోభ, ఇబ్బంది కలిగిందని కోర్టు నిర్ధారించింది.

ఈ మేరకు రైల్వే యాజమాన్యం సేవా లోపాన్ని ఎత్తిచూపుతూ.. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి పరిహారంగా రూ.10,000, టికెట్ ఛార్జీల వాపసు కింద రూ.1,000, కోర్టు ఖర్చుల నిమిత్తం రూ.5,000.. ఇలా మొత్తంగా రూ.16,000 చెల్లించాలని ఆదేశించింది.

రైలు ప్రయాణికులకు కనీస వసతులు కల్పించాల్సిన బాధ్యత రైల్వే శాఖదేనని ఈ తీర్పు మరోసారి గుర్తు చేసింది. రైళ్లలో మరుగుదొడ్డి, నీరు వంటి కనీస వసతులు లేకపోయినా లేదా సేవల్లో లోపం ఉన్నా 1915 (వినియోగదారుల హెల్ప్‌లైన్) నంబర్‌ను సంప్రదించి తగిన పరిహారం పొందవచ్చని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.


Posted

in

by

Tags: