చైనాలో ఓ వ్యక్తి ప్రారంభించిన వింత వ్యాపారం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇతరుల తరఫున వెళ్లి, వారు అడగలేని ప్రశ్నలను అడగడం, వారి హక్కుల కోసం వాదించడం, అవసరమైతే నేరుగా వెళ్లి గొడవ పడటం ఈ వ్యక్తి అందిస్తున్న ప్రత్యేక సేవ. ఇందుకోసం ఒక్కోసారి సుమారు రూ.2,700 వసూలు చేస్తున్నట్లు సమాచారం.
సాధారణంగా కొందరు ఇతరులతో మాట్లాడాలన్నా, తమకు రావాల్సిన డబ్బులు అడగాలన్నా సంకోచిస్తుంటారు. ముఖ్యంగా ఇంట్రోవర్ట్స్ అని పిలిచే అంతర్ముఖ స్వభావం కలిగినవారు తమ సమస్యలను గట్టిగా చెప్పలేక ఇబ్బందులు పడుతుంటారు. అలాంటి వారి కోసమే ఈ వ్యక్తి ఈ వినూత్న సేవను అందిస్తున్నట్లు తెలుస్తోంది.
హోటల్లో అదనంగా సాంబార్ లేదా చట్నీ అడగడానికి కూడా ఇబ్బందిపడేవారు మొదలుకొని, కంపెనీల్లో పెండింగ్లో ఉన్న జీతాలు అడగలేనివారి వరకు.. ఈ సేవను ఉపయోగించుకోవచ్చట. సరైన సేవలు అందించని దుకాణాలు, సంస్థలను ప్రశ్నించడం, ఆన్లైన్ లావాదేవీల్లో తిరిగి రావాల్సిన డబ్బులను రీఫండ్ రూపంలో పొందేందుకు ప్రయత్నించడం వంటి పనులను కూడా ఆయన కస్టమర్ల తరఫున చేస్తారని సమాచారం.
తమ సమస్యలను నేరుగా చెప్పలేని వారికి ఈ సేవ ఉపయోగకరంగా ఉంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం ఇలాంటి పనుల కోసం కూడా ప్రత్యేకంగా డబ్బులు చెల్లించే పరిస్థితి రావడం ఆసక్తికరంగా ఉందంటున్నారు.
ఈ వింత వ్యాపారానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. “ఇది నిజంగా అదిరిపోయే బిజినెస్ ఐడియా.. మనకు మాట్లాడటం ఇష్టం లేకపోతే, మన తరఫున మాట్లాడేందుకు ఒకరిని నియమించుకోవచ్చన్నమాట!” అంటూ నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
