బెంగళూరు నుంచి శివమొగ్గకు రైలులో ప్రయాణిస్తున్న ఒక కుటుంబానికి మరుగుదొడ్డిలో (వాష్‌రూమ్‌లో) నీళ్లు లేకపోవడంతో తీవ్ర అసౌకర్యం కలిగింది.
దీనిపై తుమకూరు రైల్వే స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఎలాంటి సహాయం అందకపోవడంతో, ఆ కుటుంబంలోని 24 మంది రైలు దిగిపోయి రూ.1,760 అదనపు ఖర్చుతో వేరే రైలులో ప్రయాణించాల్సి వచ్చింది. ఈ ఘటనపై బాధిత ప్రయాణికుడు నాగేంద్ర వేసిన కేసులో, రైల్వే సేవా లోపాన్ని తప్పుబట్టిన శివమొగ్గ జిల్లా వినియోగదారుల కోర్టు.. ప్రయాణికులకు పరిహారం, టికెట్ ఛార్జీని వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని సంచలన తీర్పు ఇచ్చింది.
శివమొగ్గకు చెందిన నాగేంద్ర తన కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి (మొత్తం 24 మంది) యశ్వంత్‌పూర్ నుంచి శివమొగ్గ వెళ్లే రైలులో రూ.1,000 ఖర్చుతో జనరల్ బోగీ టికెట్ తీసుకుని ప్రయాణించారు. ప్రయాణ సమయంలో రైలు మరుగుదొడ్లలో నీళ్లు లేకపోవడంతో వారంతా తీవ్ర అవస్థలు పడ్డారు. తుమకూరు రైల్వే స్టేషన్లో దిగి స్టేషన్ మాస్టర్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి పరిష్కారం దొరకలేదు. దీంతో వేరే దారి లేక వారు ఆ రైలు దిగిపోయి, అదనంగా డబ్బులు చెల్లించి వేరొక రైలులో తమ ప్రయాణాన్ని ముగించారు.
ఆ తర్వాత రైల్వే అధికారులకు లీగల్ నోటీసులు పంపినా ఎలాంటి స్పందన రాకపోవడంతో, నాగేంద్ర శివమొగ్గ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌లో కేసు వేశారు. ఈ కేసును విచారించిన కన్స్యూమర్ కమిషన్ అధ్యక్షుడు టి. శివన్న, సభ్యుడు బి.టి. యోగానందలతో కూడిన ధర్మాసనం.. రైలులో కనీస సదుపాయమైన నీళ్లు లేకపోవడం, రైల్వే స్టేషన్లో సహాయం చేయకపోవడం కచ్చితంగా సేవా లోపమేనని స్పష్టం చేస్తూ రైల్వే శాఖకు జరిమానా విధించింది.
ఈ తీర్పు ప్రకారం, నైరుతి రైల్వే (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అధికారులు నాగేంద్రకు అసలు టికెట్ ధర రూ.1,000ని 6 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలి. అంతేకాకుండా, ఆ కుటుంబం అనుభవించిన మానసిక క్షోభకు రూ.10,000 పరిహారంగా, కోర్టు ఖర్చుల కింద రూ.5,000 కలిపి (టికెట్ ధరతో సహా మొత్తం రూ.16,000) చెల్లించాలని ఆదేశించింది. ఈ మొత్తాన్ని 45 రోజుల్లోగా చెల్లించడంలో విఫలమైతే 10 శాతం వడ్డీతో చెల్లించాల్సి ఉంటుందని వినియోగదారుల కోర్టు గడువు విధించింది.

Leave a Reply