పాకిస్థాన్ రాజకీయాల్లో ఇరాన్ సమావేశం కేంద్రంగా ఆసక్తికరమైన వివాదం చెలరేగింది. టెహ్రాన్‌లో జరిగిన ప్రాంతీయ భద్రతకు సంబంధించిన ఉన్నత స్థాయి సమావేశానికి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ హాజరుకాగా, ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మాత్రం పాకిస్థాన్ పార్లమెంట్లో కూర్చోవడం చర్చనీయాంశమైంది.
అక్టోబర్ 28, 2026న పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మాట్లాడిన ‘జమియత్ ఉలేమా-ఇ-ఇస్లాం-ఫజల్’ (JUI-F) చీఫ్ మౌలానా ఫజలుర్ రెహ్మాన్.. ఇరాన్లో కీలకమైన భద్రతా చర్చలు జరుగుతుంటే రక్షణ మంత్రి పార్లమెంట్లో ఎందుకు కూర్చున్నారని ప్రశ్నించారు. అంతేకాకుండా, గతంలో ప్రతిపక్షాలను విమర్శించడానికి ఖవాజా ఆసిఫ్ ఉపయోగించిన ‘కొంచెమైనా సిగ్గు, శరం ఉండాలి’ అనే పదాలతోనే ఆయన్ను ఎగతాళి చేశారు. దీంతో పార్లమెంట్లో నవ్వులు పూశాయి.
ఇరాన్లో జరిగిన ఈ సమావేశానికి పాకిస్థాన్ హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ హాజరుకావడంపైనా ఫజలుర్ రెహ్మాన్ ప్రశ్నల వర్షం కురిపించారు. భద్రతకు సంబంధించిన సమావేశంలో ఆయనకేం పని అని నిలదీశారు. ఈ సమావేశంలో సౌదీ అరేబియా, టర్కీ, ఇరాన్ దేశాల ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. పాకిస్థాన్‌లో ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వానికి, సైనిక నాయకత్వానికి మధ్య ఉన్న అధికార పోరును ఈ ఘటన మరోసారి వెలుగులోకి తెచ్చింది.
దీనిపై అక్టోబర్ 29న పార్లమెంట్లో రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ బదులిస్తూ.. టెహ్రాన్‌లో కొత్త భద్రతా ఒప్పందాలేవీ కుదరలేదని, ఆ సమావేశం తన మంత్రిత్వ శాఖ పరిధిలోకి రాదని వివరణ ఇచ్చారు. ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ కేవలం ప్రాంతీయ శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్లే పని మాత్రమే చేశారని, అందుకే అక్కడ తన అవసరం లేదని చెబుతూ ఆయన పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
