మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ జిల్లా హజీరా పోలీస్ స్టేషన్ పరిధిలోని కాంచ్‌మిల్ ప్రాంతంలో, మొబైల్ ఫోన్‌లో దేవుడి వీడియోలు చూసే విషయంలో భార్యాభర్తల మధ్య జరిగిన వింత వాగ్వాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఆగ్రహానికి గురైన భర్త తన భార్యను కత్తితో నరికిన షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.
కాంచ్‌మిల్ బడా గేట్ సమీపంలో కరణ్‌వీర్ అలియాస్ కారు తోమర్, అతని భార్య రేవతి అలియాస్ రీతు తోమర్ నివసిస్తున్నారు.
ఘటన జరిగిన సమయంలో, భార్య తన మొబైల్‌లో శ్రీరాముడి వీడియోలు చూస్తోంది. అక్కడికి వచ్చిన భర్త కరణ్‌వీర్, రాముడికి బదులుగా ‘మహాకాల్’ (శివుడు) వీడియోలు చూడాలని భార్యను తీవ్రంగా ఒత్తిడి చేశాడు. ఆమె ఇందుకు నిరాకరించడంతో, కోపంతో రగిలిపోయిన భర్త ఇంట్లోని పూజగదిలో ఉంచిన కత్తిని తీసుకొచ్చి భార్యపై దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడింది.
ఈ దాడి నుంచి తప్పించుకునేందుకు యత్నించిన గాయపడిన రీతు తోమర్, వెంటనే పరుగు తీసి పక్కింటి వారి ఇంట్లో తలదాచుకుంది. వెంటనే ఇరుగుపొరుగు వారు జోక్యం చేసుకుని ఆమె ప్రాణాలను కాపాడారు. మరోవైపు, ఘటనా స్థలం నుంచి పరారైన భర్త కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందడంతో, గాయపడిన మహిళను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు, పరారీలో ఉన్న భర్తను త్వరగా అరెస్టు చేసేందుకు తీవ్ర చర్యలు చేపట్టారు.

Leave a Reply