భర్త దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం..! “అదే రోజున భార్యను శవంగా మార్చి దుప్పటితో కప్పేసిన భర్త”. కొడుకుకు చెప్పేసి స్టేషన్‌కు వెళ్లిపోయాడు. కన్నీటితో బాలుడు ఇచ్చిన వాంగ్మూలం.!

దేశవ్యాప్తంగా వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు కోసం కర్వా చౌత్ ఉపవాసం ఉండి పూజలు చేసిన రోజునే, మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్‌లో ఓ భర్త తన భార్యను దారుణంగా కొట్టి చంపిన షాకింగ్ ఘటన గురువారం చోటుచేసుకుంది.

గ్వాలియర్‌లోని త్యాగి నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఆనంద్ శ్రీవాస్తవ అనే వ్యక్తి, తన భార్య మధు శ్రీవాస్తవ తలపై బలంగా కొట్టి ఈ కిరాతక హత్యకు పాల్పడ్డాడు. హత్య చేసిన తర్వాత తన కొడుకు వద్దకు వెళ్లి “నేను మీ అమ్మను చంపేశాను” అని చెప్పి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తనకు తానుగా లొంగిపోయాడు.

బాలుడు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. “ఆ రోజు కర్వా చౌత్ పండుగ కావడంతో తాను ఇంటి పనులేమీ చేయనని అమ్మ నాన్నతో చెప్పి పడుకోవడానికి వెళ్లింది. అమ్మానాన్నల మధ్య కుటుంబ విషయాలకు సంబంధించి తరచూ గొడవలు జరుగుతుండేవి” అని తెలిపాడు. అలాగే, “అమ్మ ఎప్పుడూ తన పుట్టింటి వారికే మద్దతిస్తుందని, తనకు అండగా నిలబడటం లేదని, భార్య తరఫు బంధువులంతా తనకు శత్రువులని నాన్న తరచూ గొడవ పడేవాడని” ఆ చిన్నారి కన్నీరుమున్నీరుగా పోలీసులకు వివరించాడు.

హత్య జరగడానికి ముందు రోజు వంట చేసే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఆగ్రహంతో భార్యను చంపేసి మృతదేహాన్ని దుప్పటితో కప్పేసిన ఆనంద్, కొడుకుకు నిజం చెప్పి స్టేషన్‌కు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు దుప్పటి తీసి చూడగా, తలపై తీవ్ర గాయాలతో మధు రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. 2010లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.

ప్రస్తుతం ఆనంద్ శ్రీవాస్తవను అరెస్టు చేసిన పోలీసులు, ఈ హత్య వెనుక ఉన్న పూర్తి కారణాలు, ఘటనకు దారితీసిన పరిస్థితులపై ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. భర్త దీర్ఘాయుష్షు కోసం భార్యలు ఎంతో భక్తితో ఉపవాసం ఉండే రోజున, ఓ భర్త కట్టుకున్న భార్యనే కిరాతకంగా చంపిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని, దిగ్భ్రాంతిని నింపింది.


Posted

in

by

Tags: