రాజస్థాన్ రాష్ట్రం రాజ్‌సమంద్ జిల్లాలోని గోరఖాటి ప్రాంతంలో, హైవేపై జరిగిన ఓ ప్రమాదంలో ఒక ఆవు తన ఎడమ ముందు కాలును కోల్పోయింది.
దీంతో ఆ ఆవు మామూలుగా నడవలేక, తనంతట తానుగా లేచి నిలబడలేని దీనస్థితికి చేరుకుంది. ఆవు పరిస్థితిని చూసి చలించిన స్థానికులు, అది మళ్లీ నడిచేలా సహాయం చేసేందుకు నడుంబిగించారు.
ఈ ఘటన గురించి నారాయణ్ సేవా సంస్థాన్ అధ్యక్షుడు ప్రశాంత్ అగర్వాల్‌కు సమాచారం అందించారు. స్పందించిన ఆయన, తమ సంస్థకు చెందిన కృత్రిమ అవయవాలు, శారీరక కదలికల సహాయక పరికరాల విభాగానికి చెందిన నిపుణుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపించారు. ఆ బృందం ఆవు ఆరోగ్య పరిస్థితిని, దెబ్బతిన్న కాలు ఆకృతిని పరిశీలించి, దానికి కృత్రిమ కాలు అమర్చడానికి ఉన్న అవకాశాలను అధ్యయనం చేసింది.
ఆవు శరీర నిర్మాణానికి, దాని అవసరానికి తగినట్లుగా కృత్రిమ కాలును తయారు చేసే బాధ్యతను ఆ విభాగం అధిపతి డాక్టర్ మానస్ రంజన్ సాహూ నేతృత్వంలోని బృందం చేపట్టింది. ఆవు కొలతలను ఆధారంగా చేసుకుని.. అవసరమైన సామగ్రి, దృఢత్వం, అమర్చే విధానాన్ని పరిగణనలోకి తీసుకుని ఓ ప్రత్యేకమైన మాడ్యులర్ కృత్రిమ కాలును తయారు చేశారు.
కృత్రిమ కాలు సిద్ధమైన తర్వాత, నిపుణుల బృందం మళ్లీ గోరఖాటికి వెళ్లి దానిని ఆవుకు అమర్చారు. దాని సహాయంతో ఆవును తిరిగి నిలబెట్టి, నడిపించే ప్రయత్నం విజయవంతమైంది. ప్రమాదం తర్వాత ఏమాత్రం కదలలేని స్థితిలో ఉన్న ఆవు తిరిగి లేచి నిలబడటం చూసి అక్కడున్న వారంతా ఎంతో సంతోషించారు. మనుషుల కోసం కృత్రిమ అవయవాలను తయారు చేసే సాంకేతికతను ఉపయోగించి, గాయపడిన మూగజీవికి సహాయం చేయడం ఈ బృందం చూపిన గొప్ప మానవత్వానికి నిదర్శనం.
