కడలూరు జిల్లా పన్రుట్టి సమీపంలోని సిరువత్తూరు గ్రామానికి చెందిన రమేష్, ఎళిల్ సెల్వి దంపతుల 19 ఏళ్ల కుమారుడు ప్రశాంత్. అతని తల్లి ఎళిల్ సెల్వి చెన్నైలోని ప్రముఖ నటుడు శరత్‌కుమార్, నటి రాధిక దంపతుల ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తున్నారు. టైల్స్ వేసే కూలీ పని చేసుకునే ప్రశాంత్, గత 27వ తేదీన చెన్నైలో ఉన్న తన తల్లిని చూడటానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లి, తిరిగి రాకుండా అనుమానాస్పద రీతిలో అదృశ్యమయ్యాడు.
దీంతో తీవ్ర ఆందోళనకు గురైన కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ దొరకకపోవడంతో పుదుప్పేట్టై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రశాంత్ సెల్‌ఫోన్ టవర్ లొకేషన్ ఆధారంగా ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఆ విచారణలో, అదే ఊరికి చెందిన స్నేహితులైన దేవరాసు (18), దినేష్ (23) అనే ఇద్దరిని అదుపులోకి తీసుకుని పుదుప్పేట్టై పోలీసులు విచారించగా విస్మయపరిచే నిజాలు వెలుగులోకి వచ్చాయి.
స్నేహితుల మధ్య అప్పటికే విభేదాలు ఉన్న నేపథ్యంలో.. దేవరాసు, దినేష్ కలిసి ప్రశాంత్‌ను పొన్నేరి బీచ్ (సముద్రతీర) ప్రాంతానికి పిలిపించి, దారుణంగా కొట్టి చంపి ఇసుకలో పాతిపెట్టినట్లు నేరాన్ని అంగీకరించారు. ఈ ఘటనకు సంబంధించి దేవరాసు, దినేష్‌లను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ కిరాతక హత్య వెనుక ఉన్న అసలు కారణాలపై ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ దారుణ ఘటన పన్రుట్టి పరిసర ప్రాంతాల్లో తీవ్ర దిగ్భ్రాంతిని, కలకలాన్ని రేపింది.
