“సొంత అక్కనే చంపి నాటకమాడిన కిరాతక చెల్లెలు!” భర్త అక్రమ సంబంధంతో నెత్తురోడిన కుటుంబ బంధాలు.. కలకలం రేపిన ఘటన..!!!

మానవ సంబంధాల పవిత్రతనే ప్రశ్నించేలా కొందరు వ్యక్తులు చేసే పనులు ఎంతటి కఠినాత్ములనైనా కలచివేస్తాయి.

కుటుంబంలో ఉండాల్సిన ఆప్యాయత, గౌరవం కనుమరుగై.. అక్రమ సంబంధాలు, అత్యాశ తలెత్తినప్పుడు ఎలాంటి దారుణాలు జరుగుతాయో చెప్పడానికి జార్ఖండ్ రాష్ట్రంలో జరిగిన ఈ కేసులో వెలుగుచూసిన దిగ్భ్రాంతికరమైన వాస్తవాలే సజీవ సాక్ష్యం.

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఓ మహిళను హత్య చేసి, దాన్ని ఓ సాధారణ ప్రమాదంగా చిత్రీకరించేందుకు నాటకమాడిన భర్త, అతని మరదలు పోలీసుల ముమ్మర విచారణలో అడ్డంగా దొరికిపోయారు.

జార్ఖండ్ రాష్ట్రం రామ్‌గఢ్ జిల్లా పరిధిలోని ఓ ప్రాంతంలో నివాసం ఉంటున్న 34 ఏళ్ల జెబా పర్వీన్ అనే మహిళ గత అక్టోబర్ 17వ తేదీన తన ఇంట్లో అనుమానాస్పద స్థితిలో శవమై కనిపించడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది. ఆ రోజు సాయంత్రం ఆమె భర్త గులామ్ సర్వార్ పని మీద బయటకు వెళ్లగా, పిల్లలు ట్యూషన్‌కు వెళ్లిన సమయంలో ఆ మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది.

ఆమె ఇంట్లో కింద పడి మరణించిందని మొదట్లో చెప్పినప్పటికీ, ఆమె శరీరంపై ఉన్న గాయాలు, అక్కడి పరిస్థితులను బట్టి చూస్తే అది ప్రమాదవశాత్తు జరిగిన మరణం కాదని, పక్కా ప్రణాళికతో జరిగిన హత్య అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసి ముమ్మర విచారణ ప్రారంభించారు.

పోలీసులు జరిపిన లోతైన విచారణలో ఆ మరణం వెనుక ఉన్న షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. గులామ్ సర్వార్ తన భార్య సొంత చెల్లెలైన నేహా పర్వీన్‌తో కొన్నేళ్లుగా రహస్యంగా వివాహేతర సంబంధం నెరపుతున్నట్లు విచారణలో తేలింది.

ఈ విషయం తెలుసుకున్న జెబా పర్వీన్ పలుమార్లు వారిని మందలించడంతో పాటు, తన భర్తకు దూరంగా ఉండాలని చెల్లెలిని హెచ్చరించింది. ఘటన జరిగిన రోజు కూడా ఇదే విషయమై గొడవ ముదరడంతో, భర్త, చెల్లెలు కలిసి జెబాపై దాడి చేసి ఆమె తలని గోడకేసి బలంగా బాదారు.

దీంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ హత్యను కప్పిపుచ్చేందుకు వాళ్లు ఆడిన నాటకం బట్టబయలు కావడంతో, పోలీసులు వారిద్దరినీ అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి (రిమాండ్) తరలించారు.


Posted

in

by

Tags: