ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాగ్పత్ జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుకకు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తున్న అధికారులకు.. ఓ మహిళ పెట్టిన వింత కోరిక చూసి మైండ్ బ్లాంక్ అయింది.
చేతిలో చంటిబిడ్డతో, తన భర్తతో కలిసి వచ్చిన ఆ మహిళ.. తన మరిదిని (భర్త తమ్ముడిని) పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు దరఖాస్తు చేసుకుంది.
అధికారులు ఆమె పత్రాలను పరిశీలించగా, ఆమెకు అప్పటికే వివాహమైందని, ఒక బిడ్డ కూడా ఉన్నాడని తెలిసింది. “ఇప్పటికే పెళ్లై భర్త బతికి ఉండగా మళ్లీ ఎలా పెళ్లి చేసుకుంటావు?” అని అధికారులు ప్రశ్నించారు. దీనికి బదులిచ్చిన ఆ మహిళ.. తనకు తన భర్త ఇష్టం లేదని, తన మరిదిని మాత్రమే ఇష్టపడుతున్నానని తెగేసి చెప్పింది.
ఈ వ్యవహారంలో ఆమె భర్త కూడా ఆమెకు పూర్తి మద్దతు తెలపడం అధికారులను మరింత ఆశ్చర్యానికి గురిచేసింది. తన భార్య చెబుతున్నది నిజమేనని, ఆమెకు తన తమ్ముడంటేనే ఇష్టమని చెప్పిన ఆ భర్త.. ఇటీవల ఊరిలో పంచాయితీ పెట్టి తమకు లాంఛనంగా విడాకులు కూడా అయ్యాయని తెలిపాడు. అందుకు సంబంధించిన పంచాయితీ తీర్మానం పత్రాలను కూడా వారు అధికారులకు ఆధారంగా చూపించారు.
అయినప్పటికీ, ప్రభుత్వం గుర్తించిన చట్టబద్ధమైన కోర్టు విడాకుల ధృవీకరణ పత్రం (Divorce Certificate) లేకపోవడంతో, కేవలం పంచాయితీ విడాకులు చెల్లవని అధికారులు తేల్చి చెప్పారు. సరైన చట్టపరమైన పత్రాలు సమర్పించకపోవడంతో, ఆ మహిళ వివాహ దరఖాస్తును అధికారులు తిరస్కరించారు.
