జార్ఖండ్ రాష్ట్రం గిరిడీ జిల్లాలో 5 ఏళ్లుగా ప్రేమిస్తున్న యువతిని హత్య చేసిన వ్యక్తిని, అతని భార్యతో సహా పోలీసులు అరెస్టు చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
రైల్వే స్టేషన్లో మొదలైన ప్రేమ, చివరకు హత్యకు దారితీసింది. మృతురాలిని సరియా పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన లక్ష్మీ కుమారిగా గుర్తించారు. ఈ హత్య కేసులో ఆమె ప్రియుడు వినోద్ మండల్, అతని భార్య సవితా దేవిని పోలీసులు అరెస్టు చేశారు.
గత సెప్టెంబర్ 20న సరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని చిచాకి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ యువతి మృతదేహాన్ని గుర్తించారు. దీనిపై మొదట గోమో రైల్వే పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఆ తర్వాత ఈ కేసును గిరిడీ జిల్లా బగోదర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు. ఈ ఘటన వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకునేందుకు జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తుకు ఆదేశించారు. సాంకేతిక ఆధారాలు, ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మృతురాలు లక్ష్మీ కుమారిగా నిర్ధారించారు.
దర్యాప్తులో లక్ష్మీ కుమారికి, రైల్వే స్టేషన్లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్న వినోద్ మండల్‌కు గత 5 ఏళ్లుగా ప్రేమ వ్యవహారం ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అప్పటికే వివాహమైన వినోద్.. లక్ష్మి భోజనం, చదువు ఖర్చుల కోసం డబ్బులు ఇస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పీజీ చదువుతున్న లక్ష్మి, ఆంధ్రప్రదేశ్‌లోని ఓ యూనివర్సిటీలో చేరేందుకు రూ.1.5 లక్షలు కావాలని వినోద్‌ను పదే పదే అడిగినట్లు విచారణలో తేలింది. ఈ విషయమై తలెత్తిన వివాదమే హత్యకు దారితీసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
నిరంతరం డబ్బు అడుగుతుండటంతో విసుగు చెందిన వినోద్, లక్ష్మిని హత్య చేయడానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా సెప్టెంబర్ 19న ఆమెను కలవాలని పిలిచి, ఎవరూ లేని గదిలోకి తీసుకెళ్లి గొంతు నులిమి చంపినట్లు పోలీసులు తెలిపారు. ఆ తర్వాత తన భార్య సవిత సహాయంతో మృతదేహాన్ని ఓ గోనెసంచిలో కట్టి, బైక్‌పై తీసుకెళ్లి రైల్వే ట్రాక్ సమీపంలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ హత్యను రైల్వే ప్రమాదంగా చిత్రించేందుకే ఇలా చేసినట్లు తెలుస్తోంది. అనంతరం వినోద్, సవిత ఇద్దరినీ అరెస్టు చేసిన పోలీసులు.. హత్యకు ఉపయోగించిన బైక్, మొబైల్ ఫోన్, గోనెసంచి తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
