సరిహద్దులో భగ్గుమన్న యుద్ధం.! బాంబుల వర్షం కురిపించిన పాకిస్థాన్ సైన్యం. ఆఫ్ఘనిస్థాన్‌లో నేలమట్టమైన సైనిక శిబిరాలు. తాలిబాన్ల సంచలన ఆరోపణ..!

పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో అకస్మాత్తుగా జరిగిన కాల్పులు, ఆ వెంటనే జరిగిన వైమానిక దాడులతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

అక్టోబర్ 27న దక్షిణ వజీరిస్థాన్‌లోని అంగూర్ అడ్డా ప్రాంతంలో ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా ఆఫ్ఘన్ తాలిబాన్ దళాలు కాల్పులు ప్రారంభించినట్లు సమాచారం. దీనికి ప్రతికారం తీర్చుకునేందుకు రంగంలోకి దిగిన పాకిస్థాన్ సైన్యం.. భారీ ఆయుధాలతో సరిహద్దు ఆవల ఉన్న తాలిబాన్ల కీలక శిబిరాలు, బంకర్లను నేలమట్టం చేసింది.

ఈ ఆకస్మిక దాడిలో తాలిబాన్ల స్థావరాలు తీవ్రంగా దెబ్బతినడంతో పాటు కొంతమంది ఫైటర్లు పారిపోయారని, పలువురు ప్రాణాలు కోల్పోయారని సమాచారం వెలువడింది. అయితే, ఈ దాడిలో సరిహద్దు ప్రాంతంలో నివసిస్తున్న అమాయక పౌరులు కూడా ప్రభావితమయ్యారని, భారీగా ఆస్తి నష్టం జరిగిందని తెలుస్తోంది.

ఈ ఘర్షణపై ఆఫ్ఘనిస్థాన్ రక్షణ మంత్రిత్వ శాఖ స్పందిస్తూ, పాకిస్థాన్ సైన్యమే ముందుగా అకారణంగా దాడికి పాల్పడిందని ఆరోపించింది. ఆఫ్ఘనిస్థాన్‌లోని పక్తికా ప్రావిన్స్‌లో ఉన్న అంగూర్ అడ్డా మార్కెట్, ఇతర కీలక కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ సైన్యం ఎలాంటి కారణం లేకుండా నాలుగు డ్రోన్ దాడులు చేసిందని ఆఫ్ఘన్ వర్గాలు తెలిపాయి.

రెండు దేశాలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్న నేపథ్యంలో, సరిహద్దులో కొనసాగుతున్న ఈ హింసాత్మక వాతావరణం ఇరు దేశాల సంబంధాలలో మరింత ఘర్షణను సృష్టించింది. దీని కారణంగా ఆ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకుని, తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది.


Posted

in

by

Tags: